Yogi Bulldozer Action : ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ 'బుల్డోజర్ న్యాయాన్ని' సమర్థించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు, వారికి అర్థమయ్యేలా, వారి భాషలోనే సమాధానం ఇవ్వటం సరైనచర్య అని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టిన 2017 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని సీఎం యోగి తెలిపారు. భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో లేదని, వారి ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ప్రమాదంలో ఉన్నాయని విమర్శించారు. హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమనే విషయం గుర్తించుకోవాలని సూచించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై యూపీ సీఎం ఆందోళన వ్యక్తంచేశారు.
"న్యాయాన్ని నమ్మేవారికి న్యాయం జరుగుతుంది. కొందరు స్వయంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, చాలా సార్లు చట్టం పరిధిలోనే వారికి జవాబు ఇవ్వటం జరుగుతుంది. ఏ విధంగా అర్థమవుతుందో ఆ భాషలోనే వారికి అర్థమయ్యేలా చేయాలి. సంబల్‌లో అన్ని చోట్ల తవ్వి ఆలయాలను గుర్తిస్తాం. ఎన్ని ఉంటే అన్ని వెతుకుతాం. అన్ని బయటికి తీస్తాం. దేవుడు ఇచ్చిన కళ్లతో సంబల్‌లో ఏం జరిగిందో చూడాలని ప్రపంచాన్ని కోరుతాం. దేశంలో ముస్లింలు ప్రమాదంలో లేరు. వారి ఓటు బ్యాంకు రాజకీయం ప్రమాదంలో ఉంది. ఏ రోజైతే భారతీయ ముస్లింలు తమ పూర్వీకులను అర్థం చేసుకుంటారో, ఆ రోజు నుంచి వారిని ఆడించేవారి ఆటలు సాగవు. తమ ఉనికిని కాపాడుకునేందుకు కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమని గుర్తించుకోవాలి. గతంలో కశ్మీర్‌లో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో తెలుసుకదా! పాకిస్థాన్‌లో ఏమైయింది? 1947కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ భారత్‌లో భాగంగా ఉండేవి. ఇది చరిత్ర. భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో ఉందని మాట్లాడుతున్నవారు ఇక్కడ హిందువులను కూడా వ్యతిరేకించారు. భారత్‌లోనే వారు హిందువులను వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వారి మానసిక స్థితి ఏమిటో అంచనా వేయవచ్చు' అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.