- 40 ఏళ్లలో లక్ష మొక్కలు నాటిన ఒడిశా ట్రీ మ్యాన్
- 20 ఏళ్ల వయసు నుంచే గాంథీరామ్ హరిత ఉద్యమం
- జాజ్‌పుర్ జిల్లాలో అంకురించిన కొత్త అడవులు
అంటూ లక్ష మొక్కలు నాటిన ఒడిశాకు చెందిన దినసరి కూలీ గాంథీరామ్ గురించి ఈటీవీ భారత్, ఈనాడులో వచ్చిన కథనాలకు స్పందన లభించింది. ఆయన కుటుంబ దీనస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణకు చెందిన రఘు ఆరికపూడి సేవా ట్రస్టు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది. ఒక సంవత్సరానికి అవసరమయ్యే నాలుగు క్వింటాళ్ల బియ్యంతోపాటు నిత్యావసర వస్తువులను ఆయనకు అందించింది.
అంతే కాకుండా శిథిలావస్థలో ఉన్న గుంథీరామ్ ఇంటిని బాగు చేయిస్తామని హామీ ఇచ్చింది. ఇంకా కుటుంబానికి కావలసిన వనరులను సమకూరుస్తామని మాట ఇచ్చింది. ఈ మేరకు జాజ్‌పుర్ జిల్లాలోని ఉసాహి గ్రామానికి వెళ్లి గాంథీరామ్ ఇంటి వద్ద ఆరికపూడి సేవా ట్రస్టు సభ్యులు బుధవారం సామగ్రిని అందించారు.

ఈ తరానికి స్పూర్తిదాయకం!
లక్ష మొక్కలు నాటిన గాంథీరామ్ గురించి ఈటీవీ భారత్, ఈనాడులో వచ్చిన కథనం చూసి చలించి సాయం చేయడానికి నిర్ణయించుకున్నామని ఆరికపూడి సేవ ట్రస్టు చైర్మన్ డాక్టర్ రఘు తెలిపారు. దినసరి కూలీ అయిన గాంథీరామ్, తనకు వచ్చే కూలీలో 90 శాతం డబ్బుతో మొక్కలు కొనుగోలు చేసి లక్షకుపైగా మొక్కలు నాటడం ఈ తరానికి స్పూర్తిదాయకమని కొనియాడారు.

ఆరికపూడి సేవ ట్రస్టు సహకారంతో!
ఆరికపూడి సేవ ట్రస్టు ద్వారా ప్రస్తుతానికి నాలుగు క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి గాంథీరామ్కు ఇంటి దగ్గర అందించారు. శిథిలావస్థలో ఉన్న ఇంటిని బాగు చేయించడం, కావలసిన వనరులను సమకూర్చే పనిని సైతం చేపడతామని హామీ ఇచ్చారు. గాంథీరామ్కు సాయం చేయడంలో ఒడిశాకి చెందిన మనోరంజన్ వారి టీమ్ సభ్యుల సహకారం అందించారని రఘు తెలిపారు.
ప్రభుత్వం తనకు కనీసం ఇంటిని కూడా మంజూరు చేయలేదని ఇటీవల ఈటీవీ భారత్‌తో గాంథీరామ్ తెలిపారు. జీవితం ఎంత కష్టతరంగా ఉన్నా, అభిరుచి కాబట్టి మొక్కలు నాటడాన్ని ఆపడం లేదని చెప్పారు. చాలా కష్టపడి తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేశానని, మిగతా ఇద్దరు కూతుళ్లను పెంచడం ఒక సవాలుగా ఉందని గాంథీ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త సంపాదన నుంచి చాలా మొత్తాన్ని మొక్కలు నాటడానికి ఖర్చు చేస్తున్నారని, తమకు ఎటువంటి ప్రభుత్వ సహాయం అందలేదని గాంథీరామ్ భార్య తులసి ఈటీవీ భారత్‌కు తెలిపారు. ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే తాము నివసిస్తున్నామని చెప్పారు. లక్షకు పైగా మొక్కలు నాటిన గాంథీరామ్ స్పూర్తిని, ఆయన కుటుంబ పరిస్థితిని ఈటీవీ భారత్- ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఆ కథనాన్ని చూసి స్పందించిన రఘు ఆరికపూడి సేవా ట్రస్టు ముందుకొచ్చి సహాయం చేసింది.
ఆక్వా బిజినెస్‌లో యువ రైతు సూపర్ సక్సెస్- రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం! యూత్‌కు ఇన్స్పిరేషన్!