Kharge On BJP And RSS : రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌కు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శత్రువులంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆయన ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మోదీ సర్కార్‌లో అంబేడ్కర్‌పై గౌరవం మాటలకే పరిమితమని ఎద్దేవా చేశారు. ఆయన వారసత్వంపై ఎప్పుడూ పెదవి విరిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
1952 ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమికి ఎస్‌ఏ డాంగే, వీడీ సావర్కర్ కారణమని, ఆ విషయాన్ని అంబేడ్కర్ ఓ లేఖలో పేర్కొన్నారని ఖర్గే తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఖర్గే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం ఆశయాలను కాంగ్రెస్ నాశనం చేసిందని హరియాణాలో మోదీ చేసిన వ్యాఖ్యలను ఖర్గే తిప్పికొట్టారు.
అసలు అంబేడ్కర్ సూత్రాలను మోదీ ఎప్పుడు అవలంబించారు? అని ఖర్గే ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని అన్నారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వలేదని, బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అంబేడ్కర్ మహర్ సమాజానికి చెందినవాడని, అంటరానివాడని అన్నట్లు తెలిపారు.
"2 సంవత్సరాల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు కాంగ్రెస్ దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా డిమాండ్. అదే మా లక్ష్యం. దీని కోసం మేం చాలా కాలంగా పోరాడుతున్నాం. కానీ మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అహ్మదాబాద్ సమావేశంలో ఆ విషయంపై ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం" అని ఖర్గే చెప్పారు.
దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘"రాజ్యాంగం పౌరులకు అంబేడ్కర్ ఇచ్చిన బహుమతి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పొందే హక్కును కల్పిస్తుంది. ఏఐసీసీ సమావేశంలో సామాజిక న్యాయానికి సంబంధించిన అభిప్రాయాలను ముందుకు తీసుకెళుతున్నాం" అని తెలిపారు.
"2011 జనాభా లెక్కల ప్రకారం, కేంద్రం విధానాలను రూపొందిస్తోంది. కానీ, 2021 జనాభా లెక్కల గురించి ఇంతవరకు జాడ లేదు. సాధారణ జనాభా లెక్కలతో పాటు ఏ విభాగంలో ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి కులగణన ఉపయోగపడుతుంది. అందుకే కులగణన కోసం కాంగ్రెస్ తన గళం వినిపిస్తోంది" అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
ఏదో ఒకరోజు ప్రధాని మోదీ దేశాన్ని అమ్మేస్తారు: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
RSSను పటేల్ బ్యాన్ చేశారు- ఆ సంస్థతో ఆయనకు సంబంధమేంటి?: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే