Special Treatment To Tahawwur Rana : 2008 ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకొని ఎంతోమంది భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దేశ వాణిజ్య రాజధానిపై ఉగ్రదాడి జరగడానికి కారకుడైన తహవూర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో అతడికి ప్రత్యేక ఏర్పాట్లేవీ చేయొద్దని కోరుతున్నారు. వీలైనంత త్వరగా రాణాను ఉరితీయాలని వాదిస్తున్నారు. రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకురావడం అనేది మోదీ సర్కారు ఘన విజయమని అభినందిస్తున్నారు.
'కసబ్‌లా రాణాకు బిర్యానీ, ప్రత్యేక సెల్ ఇవ్వొద్దు'
ముంబయిపై ఉగ్రదాడి జరిగిన సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన టీ విక్రేత మహ్మద్ తౌఫిక్ (ఛోటూ చాయ్ వాలా) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్‌గా వ్యవహరించిన 64 ఏళ్ల తహవూర్ రాణాను భారత్‌కు తీసుకొచ్చి జైల్లో వేశాక, ప్రత్యేక వసతులేవీ కల్పించకూడదన్నారు. బిర్యానీ, ప్రత్యేక సెల్ వంటివేవీ రాణాకు ఇవ్వకూడదని తౌఫిక్ పేర్కొన్నారు. రాణా లాంటి నీచులకు ఉరే సరి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రముఖ వార్తాసంస్థతో ఛోటూ చాయ్‌వాలా మాట్లాడుతూ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి దేశంలో కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. "ముంబయి ఉగ్రదాడిలో ఎంతోమందిని చంపిన టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవూర్ రాణాకు జైలులో ప్రత్యేక సెల్ కానీ, బిర్యానీ కానీ ఇవ్వకూడదు. ఆ నీచుడికి అదనపు సౌకర్యాలేవీ కల్పించకూడదు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేయకూడదు’’ అని భారత ప్రభుత్వాన్ని తౌఫిక్ కోరాడు.
రాణాకు మరణశిక్ష విధిస్తే సంబరాలు చేసుకుంటా
"ఉగ్రవాది తహవూర్ రాణాను భారత్‌కు తీసుకొస్తున్నారు అనేది పెద్ద శుభవార్త. అతడ్ని 15 రోజులు లేదా రెండు, మూడు నెలల్లోగా బహిరంగంగా ఉరితీయాలి. రాణాకు మరణశిక్ష విధిస్తే నేను సంబరాలు చేసుకుంటాను. అతడిని రక్షించేందుకు ఇతరులు ప్రయత్నించేలోగా.. ఉరితీసేయాలి. అలాంటి ఉగ్రవాదులను అంతం చేసేందుకు కఠిన చట్టాలు కావాలి. రాణాను భారతదేశానికి అప్పగించినందుకు అమెరికా ప్రభుత్వానికి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు’’ అని మహ్మద్ తౌఫిక్ పేర్కొన్నారు. ‘‘ముంబై ఉగ్రదాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం చేసింది. అయితే డబ్బులతో ఎవరి ప్రాణాలనూ తిరిగి తీసుకురాలేమని మనం గుర్తించాలి" అని ఆయన కామెంట్ చేశారు. తహవూర్ రాణాను న్యూదిల్లీలోని తిహార్ జైలులో అత్యంత భద్రత కలిగిన వార్డులో ఉంచుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తౌఫిక్ సహా కోట్లాది మంది భారతీయుల వాదన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఉగ్రదాడి వేళ తౌఫిక్ ఏం చేశాడంటే?
2008 నవంబరు 26 నుంచి 29 వరకు ముంబయి ఉగ్రదాడి జరిగినప్పుడు దక్షిణ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నాడు. ఉగ్రవాదులు ఎంతోమంది అమాయకులను చంపుతుండగా తౌఫిక్ కళ్లారా చూశాడు. దీనిపై అతడు పెద్ద సంఖ్యలో ప్రజలను అప్రమత్తం చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేలా ఎంతోమందిని సరైన వైపుగా తీసుకెళ్లాడు. ఈ దాడిలో గాయపడిన వారిలో చాలా మందిని ఆస్పత్రికి తరలించాడు.
కసబ్ బిర్యానీ అడగడం కల్పితమే : పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్
"జైలులో ఉండగా కసబ్ బిర్యానీ అడిగాడు అనేది కల్పిత అంశం మాత్రమే. అతడు ఎన్నడూ బిర్యానీ అడగలేదు. ప్రభుత్వమూ బిర్యానీ ఇవ్వలేదు. అప్పట్లో కసబ్‌కు అనుకూలంగా ఏర్పడిన ఉద్వేగభరితమైన వాతావరణాన్ని భగ్నం చేసేందుకు, నేనే దాన్ని కల్పించి కేసు విచారణలో చెప్పాను" అని ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన ఉజ్వల్ నికమ్ 2015లో వెల్లడించారు. కాగా, 2012లో పూణేలో ఉన్న ఎరవాడ జైలులో కసబ్‌ను ఉరితీశారు.