Dev Snan Purnima 2025 Puri : జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలో బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడికి పవిత్రస్నానం నిర్వహించారు. స్నానపూర్ణిమను పురస్కరించుకుని చతుర్థమూర్తికి జరిగిన పవిత్రస్నాన ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది హాజరయ్యారు. 12వ శతాబ్ధం నాటి ఆలయ ప్రాంగణంలోని స్నాన మండపంపై జరిగిన ఆ కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సహా ప్రముఖులు హాజరయ్యారు.
తొలుత బుధవారం ఉదయం 5 గంటల 45 నిమిషాల సమయంలో శ్రీ సుదర్శనుడిని తీసుకొచ్చి స్నానం చేయించారు. అనంతరం ముగ్గురు దేవతామూర్తులకు బంగారు బావిలోని 108 కుండల పవిత్రనీటితో స్నానం చేయించారు. అయితే స్నాన యాత్ర జరిగే రోజును పూరీ జగన్నాథుడి పుట్టినరోజుగా భక్తులు జరుపుకొంటారు. ఈ పవిత్రమైన రోజునే స్వామివారు జన్మించారని శాస్త్రాల్లోనూ ప్రస్తావన ఉంది.

మూలికలతో వైద్యం!
కాగా, పవిత్ర స్నానం ఘట్టంతో దేవతలకు జ్వరం, జలుబు వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే సాయంత్రం ఏడున్నర తర్వాత ముగ్గురు దేవతలను అనాసర ఘర్ అనే ప్రత్యేక గదిలో భక్తులకు అనుమతి లేకుండా ఉంచుతారు. ఆలయ ఆయుర్వేద వైద్యుడు మూలికలతో వైద్యం చేస్తాడు. తైల మర్ధనం జరుగుతుంది. అనారోగ్యం పాలైన పురుషోత్తమునికి దైతాపతి సేవాయత్‌లు కాయకల్ప చికిత్సలు, ఉపచారాలు చేస్తారు.
పాలు, మజ్జిగ, తేనె మాత్రమే!
జ్యేష్ఠమాసం, బహుళ పక్షమి చతుర్దశి తిథి వరకు ఒనొసొనొ (చీకటి) మందిరంలో ఆనవాయితీ ప్రకారం గోప్య చికిత్సలు చతుర్థమూర్తికి సేవాయత్‌లు నిర్వహిస్తారు. స్వామికి ఒబడా (మహాప్రసాదం) అర్పించరు. 15 రోజులపాటు పండ్లు, పాలు, మజ్జిగ, తేనె మాత్రమే నైవేద్యంగా పెడతారు. జగన్నాథుడు కోలుకునే వరకు శ్రీక్షేత్రంలో మంగళవాయిద్యాలు మోగవు. మళ్లీ చతుర్దశి నాడు ఆలయంలో జేగంటలు మోగుతాయి.

అప్పుడే లాడ్జిలు ఫుల్!
స్వామి కోలుకున్నట్లు రాజా గజపతి దివ్యసింగ్‌దేవ్‌కు సమాచారం తెలుపుతారు. తర్వాత ఆలయంలో వేడుకలు ప్రారంభమిస్తారు. ఆషాఢ మాసం శుక్ల పక్షమి పాఢ్యమి తిథిని (జూన్ 26న) పురుషోత్తముని నవయవ్వన నేత్రోత్సవం జరుగుతుంది. జూన్ 27న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రులు, తాగునీటి సౌకర్యాలు, బస, ట్రాఫిక్ జాం సమస్యలపై ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పూరీలో హోటల్స్, లాడ్జీలు అప్పుడే ఫుల్ అయిపోయాయి.

అహ్మదాబాద్‌లో పవిత్రస్నానం
మరోవైపు, పూరీ యాత్ర తర్వాత అతిపెద్ద అతిపెద్ద జగన్నాథ యాత్ర గుజరాత్లోని అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం పవిత్రస్నానం ఘట్టం నిర్వహించారు. సబర్మతి నది ఒడ్డున గంగా పూజ చేసి అక్కడి నుంచి 108 కుండలలో నీటిని తీసుకువచ్చి స్వామివారిని అభిషేకించారు. నీటిని తీసుకొచ్చే సమయంలో ఏనుగులు, గుర్రాలు కూడా పాల్గొన్నాయి.