Inspector Ram Manohar Transfer : విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు సడెన్గా బదిలీపై వెళ్తుంటే మమ్మల్ని వదిలి వెళ్లొద్దని విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించిన సంఘటనలు చాలా చూశాం. అలాంటిదే దిల్లీలో కూడా జరిగింది. కానీ ఈసారి టీచర్, విద్యార్థులు కాదు. ఓ ఇన్స్పెక్టర్ బదిలీపై వెళ్తున్నారని ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. వర్షం పడుతున్న లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున రావడం వల్ల ఆ ప్రాంతమంతా భావోద్వేగంతో నిండిపోయింది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారంటూ ప్రజలు బాధపడ్డారు.
సబ్జీ మండీ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పని చేశారు రామ్ మనోహర్ మిశ్రా. ప్రజలు ఆయనను రామ్ భయ్యాగా పిలుచుకునేవాళ్లు. అన్ని సామాజికి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. మహిళలకు ఆత్మరక్షణ శిక్షణలు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రజల మనసుల్లో రామ్ భయ్యాగా స్థానం సంపాదించారు. ఇన్స్పెక్టర్ రామ్ మనోహర్ మిశ్రా చేపట్టిన అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమం 'రామ్ రసోయి'. ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించేలా ఈ కార్యక్రమాన్ని సబ్జీ మండీ ప్రాంతంలో ప్రారంభించారు. ఓ వ్యక్తి పాడైపోయిన రొట్టె తినడం చూసిన ఇన్స్పెక్టర్ రామ్, తన స్నేహితుల సాయంతో ఈ రామ్ రసోయిని ప్రారంభించారు. ఇక్కడ రోజూ వందలాది మందికి భోజనం అందిస్తున్నారు.

ఇక బదిలీకి ముందు సంస్కార్, విధాన్, ఔర్ సంవిధాన్ అనే పేరుతో మరో విన్నూత ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఇన్స్పెక్టర్ రామ్. సమాజంలో పెరుగుతున్న నేరాలకు మూలకారణం మానవీయ విలువల పతనమే కాకుండా, చట్టాలు, రాజ్యాంగంపై అవగాహన లేకపోవడం వల్లనే అని మిశ్రా అన్నారు. అందుకే సంస్కార్, విధాన్, సంవిధాన్ కార్యక్రమంతో ఆయన పాఠశాలలలోకి వెళ్లి పిల్లలకు నైతిక విద్య, తాజా చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే పౌరుల విధుల గురించి కూడా వివరించారు.

ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సుల్లో స్థానాన్ని సంపాందించారు ఇన్స్పెక్టర్ రామ్. ఆయన కవితలు, ప్రసంగాలు, పాటలు ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్న విషయాలను స్పష్టంగా వివరించేవారు. ఇలా ప్రజలకు దగ్గరయ్యారు. అయితే మే 13న ఇన్స్పెక్టర్ రామ్ బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 'మీలాంటి అధికారిని మళ్లీ చూడలేం' అంటూ కొందరు పెద్దగా అరిచారు. మరికొందరు 'మీరు మా మనసును గెలుచుకున్నారు' అని అన్నారు. అక్కడికి వచ్చిన ప్రజలను చూసిన రామ్ మనోహర్ మిశ్రా కూడా భావోద్వేగానికి గురయ్యారు. మీరు చూపించే ఈ ప్రేమే తన నిజమైన సంపద అని చెప్పారు.

ప్రజలకు సేవ చేయడమే తన ప్రాధాన్యత అని, పోలీస్ అంటే కేవలం నేరాలను నియంత్రించడమే కాదని, శాంతి, న్యాయాన్ని సమతుల్యం చేయడమేనని ఇన్స్పెక్టర్ రామ్ ఈటీవీ భారత్కు తెలిపారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా వినడమే పోలీసుల మొదటి పని అని అన్నారు. 90 శాతం సమస్యలు సరైన మార్గదర్శకత్వం ద్వారా పోలీస్ స్టేషన్లోనే పరిష్కరించవచ్చని తెలిపారు.
