Delhi Govt EV Subsidy For Women : మహిళలలు దిల్లీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది!. విద్యుత్ వాహనాల పాలసీ 2.0 కింద మహిళలకు ద్విచక్ర వాహనం కొనుగోలుపై 36,000 వరకు రాయితీ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మొదటి 10 వేల మంది మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. 12,000 kWh సామర్థ్యమున్న వాహనం కొంటే పైన పేర్కొన్న రాయితీ లభిస్తుంది.
దిల్లీలో విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా కేంద్రం తెచ్చిన PM E-DRIVE పథకానికి అనుబంధంగా దిల్లీ ప్రభుత్వం ఈవీ పాలసీ 2.0ను రూపొందించింది. ఈ పథకం 31 మార్చి 2030 వరకు అమలులో ఉండనున్నట్లు సమాచారం. కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే కాకుండా త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలను కూడా లక్ష్యంగా చేసుకుని అనేక ప్రోత్సాహకాలను ఈ పథకం అందిస్తుంది.
డీఏ పెంచిన ఒడిశా ప్రభుత్వం
ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారులకు డియర్‌నెస్ అలవెన్సు -డీఏ 2శాతం పెంచనున్నట్లు శుక్రవారం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. ఈ మేరకు సీఎం కర్యాలాయం ప్రకటన వెలువరించింది. ఈ డీఏ పెంపు 1 జనవర 2025 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయం దాదాపు 8.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ఏప్రిల్ నెల శాలరీతో పాటు క్యాష్ బెనిఫిట్ రూపంలో ఉద్యోగులు ఈ డీఏను పొందనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పింఛనుదారులకు ఇచ్చే టెంపరరీ ఇంక్రీజ్-టీఐ 53 నుంచి 55 శాతానికి చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. వేలల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కుటుంబాల ఆర్థిక భద్రతకు ఇది సానుకూల ముందడుగు అని కొనియాడాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా డియర్‌నెస్ అలవెన్సు (డీఏ) 2 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.