త్రికాల్ పేరుతో హైటెక్ అటాక్ డ్రోన్లు రెడీ- ఆపరేషన్ సిందూర్‌తో డ్రోన్లపై భారత్ ఫోకస్!
ఆధునిక యుద్ధంలో కీలకంగా డ్రోన్లు- రూ.20,000 కోట్ల ప్రతిపాదనను రక్షణ శాఖ చర్చ

Published : July 9, 2025 at 11:51 PM IST
Drone Technology in Modern Warfare : ఆధునిక యుద్ధంలో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, శత్రు లక్ష్యాలపై సులభంగా దాడి చేసేలా ఉంటుండటంతో డ్రోన్ల తయారీపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. మూడేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లదే కీలక పాత్ర. ఉక్రెయిన్-రష్యా నిత్యం వందలాది డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-గాజా యుద్ధంలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ డ్రోన్లతో దాడులు చేయగా యాంటి డ్రోన్ సిస్టమ్స్‌తో భారత్ వాటిని సమర్థంగా కూల్చివేసింది. పాకిస్థాన్ వైపు నుంచి పంజాబ్‌లోకి అనేక సార్లు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరగ్గా భారత దళాలు వాటిని కూల్చివేశాయి.
ఈ నేపథ్యంలో భారత్ సైతం అధునాతన డ్రోన్లు, యాంటి డ్రోన్ సిస్టమ్స్‌పై దృష్టి సారించింది. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ అనే స్టార్టప్ సంస్థ భారత ఆర్మీ కోసం త్రికాల్ పేరుతో హైటెక్ అటాక్ డ్రోన్లను తయారు చేసింది. ఈ హైటెక్ డ్రోన్లు శత్రు దేశాల డ్రోన్ల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా శత్రు డ్రోన్లను కూల్చివేసేలా వీటిని తయారు చేశారు.
ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు 6 గ్రెనేడ్లను, 6 మోర్టార్ షెల్స్‌ను మోసుకెళ్లగలవని ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సీఈవో ఆర్త్ చౌధరి తెలిపారు. థర్మల్ సెన్సార్లు ఉండటం వల్ల రాత్రి వేళ సైతం ఇవి బాగా పని చేయగలవని పేర్కొన్నారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య వీటిని పరీక్షించి చూసినట్టు చెప్పారు. ఈ డ్రోన్లు 2 గంటల సమయం పాటు ఎగరగలవనీ 11 కిలోల వరకు పేలోడ్‌ను మోసుకెళ్లగలవని తెలిపారు. ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవని, 19 వేల అడుగుల వరకు ఎత్తు వరకు వెళ్లగలవని తయారీదారులు వెల్లడించారు. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లదే కీలక పాత్ర అని పేర్కొన్న ఈ స్టార్టప్ సంస్థ, ఆపరేషన్ సిందూర్ తర్వాత డ్రోన్ల ప్రాముఖ్యత మరింత పెరిగిందని పేర్కొంది. ఈ హైటెక్ అటాక్ డ్రోన్లను ఆర్మీకి అప్పగించనున్నట్టు తెలిపింది.
రూ.20,000 కోట్ల ప్రతిపాదనను రక్షణ శాఖ చర్చ
మరోవైపు సముద్రం, భూ సరిహద్దులపై నిఘా పెంచేందుకు 87 మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ల ప్రాజెక్టును వేగంవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. భారత వైమానిక దళ నాయకత్వంలోని త్రివిధ దళాలు చేసిన రూ.20,000 కోట్ల ప్రతిపాదనను రక్షణ శాఖ చర్చించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 60శాతం కంటే ఎక్కువగా స్వదేశీ సామర్థ్యంతో రూపొందించాలని ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటుగా ఈ డ్రోన్లు సుమారు 35,000 అడుగుల ఎత్తులో ఒకేసారి 30 గంటలకు పైగా ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నిబంధనలు పెట్టింది. దీనికి అదానీ డిఫెన్స్‌తో పాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, హాల్ పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
'ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది- కానీ శత్రుదాడిలో మాత్రం కాదు!
'భారత్‌పై చైనా 'వాటర్ బాంబ్'!- సరిహద్దులో అతిపెద్ద జలవిద్యుత్ డ్యాం నిర్మాణం

