D4 Anti Drone System : భారత్‌కు చెందిన 'డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్' పాకిస్తాన్‌కు పీడకలగా మారింది. చైనీస్, టర్కిష్ డ్రోన్లతో ఇటీవలే భారత గగనతలంలోకి చొరబాటుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను 'డీ4' విజయవంతంగా భగ్నం చేసింది. దీంతో తమ డ్రోన్ల ఆటలు ఇక సాగవనే భావనకు పాకిస్థాన్ ఆర్మీ వచ్చింది. డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసింది. ''డ్రోన్, డిటెక్ట్, డిటెర్, డెస్ట్రాయ్'' అనే నాలుగు ప్రధాన విధులను ఈ వ్యవస్థ నిర్వర్తిస్తుంది. అందుకే దీనికి 'డీ4' అనే పేరును పెట్టారు. భారత శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థతో ముడిపడిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.
'డీ4' తయారీలో భాగమైన సంస్థలివీ
భారత ప్రభుత్వం రక్షణ రంగంలో మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా డీఆర్‌డీఓ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సహా పలు దేశీయ పరిశ్రమల సహకారంతో 'డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్'ను తయారు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగమైన సంస్థల జాబితాలో ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE), బెంగళూరు; డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబొరేటరీ (DERL), హైదరాబాద్; సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS), హైదరాబాద్; ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (IRDE), దేహ్రాదూన్ ఉన్నాయి. వివిధ రకాల డ్రోన్‌లను గుర్తించి, నేలకూల్చే విషయంలో డీ4 వ్యవస్థ సామర్థ్యాన్ని భారత హోం, రక్షణ శాఖల పరిధిలోని భద్రతా సంస్థలన్నీ ఆమోదించాయి. భారత సైన్యం కూడా డీ4 వ్యవస్థలను పలుమార్లు పరీక్షించి చూసింది.

ఒక్కో సెన్సర్ ఒక్కో పని
డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థలో విభిన్న రకాల రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు ఉంటాయి. ఒక్కో సెన్సర్ ఒక్కో పనిని చేస్తుంది. శత్రువుల డ్రోన్లను గుర్తించడం ఒక సెన్సర్ పనైతే, ఆ డ్రోన్‌కు చెందిన కమ్యూనికేషన్ సిగ్నల్స్‌ను కట్ చేయడం మరో సెన్సర్ పని, డ్రోన్‌లో ఉన్న హార్డ్‌వేర్‌కు గురిపెట్టడం ఇంకొక సెన్సర్ పని. ఈ పనులన్నింటినీ క్రమ పద్ధతిలో సమన్వయం చేసే వ్యవస్థ కూడా డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్‌లో ఉంటుంది. ఈ విభిన్న రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్ల అభివృద్ధి కోసం వివిధ విభాగాల్లో ప్రత్యేకత కలిగిన దాదాపు నాలుగు ల్యాబ్‌లకు చెందిన నిపుణులను డీఆర్‌డీఓ ఒకచోటుకు చేర్చింది.

శత్రు డ్రోన్లను 'డీ4' ఎలా గుర్తిస్తుంది?
శత్రువుల డ్రోన్లు గగనతలంలో చక్కర్లు కొట్టగానే డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థ గుర్తించగలదు. ఇందుకోసం అది వివిధ రకాల సాంకేతికతల సహకారాన్ని తీసుకుంటుంది. రేడియో-ఫ్రీక్వెన్సీ (RF), రాడార్ సమాచారం, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ అనే మూడు పద్ధతుల్లో శత్రువుల డ్రోన్లను డీ4 వ్యవస్థ గుర్తిస్తుంది. శత్రు డ్రోన్లను గుర్తించే క్రమంలో సహకరించేందుకు డీ4 వ్యవస్థలో ప్రత్యేక సెన్సర్లు ఉంటాయి. డీ4 వ్యవస్థలో ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరాలు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి. చిమ్మ చీకట్లోనూ ఇవి శత్రు డ్రోన్లను సులభంగా పసిగడతాయి. ప్రత్యేకించి తక్కువ ఎత్తులో ఎగురుతున్న చిన్న డ్రోన్‌లను వెంటనే గుర్తించగలవు. ఆ వెంటనే డీ4 వ్యవస్థ వాటిని ట్రాక్ చేసి, నిర్వీర్యం చేస్తుంది.
'డీ4'లోని ఏఐ ఇంజిన్ ఏం చేస్తుంది?
ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) యుగం. శత్రు డ్రోన్ వల్ల పొంచి ఉన్న ముప్పు ఎలాంటిదనే దానిపై ఏఐ టెక్నాలజీ సాయంతో డీ4 వ్యవస్థ ఒక అంచనాకు వస్తుంది. డీ4లో ఉన్న ఏఐ ఇంజిన్ నుంచి వెలువడే సిగ్నల్స్- పక్షులు, గాలిపటాలు, డ్రోన్‌ల మధ్య ఉన్న తేడాను గుర్తిస్తాయి. క్వాడ్ కాప్టర్, ఫిక్స్‌డ్ వింగ్ లేదా హైబ్రిడ్ డ్రోన్ రకాలలో దేనికి చెందిందనే దానిపై క్లారిటీకి వస్తుంది.

శత్రు డ్రోన్ల సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ ఇలా
శత్రు డ్రోన్‌కు పైలట్ నుంచి అందుతున్న రేడియో ఫ్రీక్వెన్సీని డీ4 వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తుంది. దాని లోపల ఉన్న ఎలక్ట్రానిక్ వ్యవస్థలను జామ్ చేస్తుంది. దీనివల్ల శత్రుదేశం పైలట్‌కు, వాళ్ల డ్రోన్‌కు మధ్య కమాండ్ లింక్ తెగిపోతుంది. ఆ తర్వాత జీపీఎస్ స్పూఫింగ్ ద్వారా సదరు డ్రోన్‌ను తప్పుదారి పట్టిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియనే 'సాఫ్ట్ కిల్' అంటారు. చివరగా శత్రు డ్రోన్ లక్ష్యంగా 'హార్డ్ కిల్' ప్రక్రియను డీ4 వ్యవస్థ మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా డ్రోన్ వైపుగా శక్తివంతమైన లేజర్ కిరణాలను విడుదల చేస్తుంది. అవి వెళ్లి గాల్లో చక్కర్లు కొడుతున్న డ్రోన్‌ను తాకగానే మంటలు మొదలవుతాయి. డ్రోన్ క్రమంగా మొత్తం కాలిపోయి, నేలకూలుతుంది. కొన్ని డ్రోన్లపై 'సాఫ్ట్ కిల్' పని చేయకపోతే- నేరుగా శక్తివంతమైన లేజర్‌లను ప్రయోగించి హార్డ్ కిల్‌ను చేపడతారు.
ఉగ్రవాదులకు ఊహించని చావుదెబ్బ-పాక్ న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్స్‌కు భయపడేది లేదు : మోదీ
కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు : ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్