India Covid Cases Today : దేశంలో ప్రస్తుతం 257 కొవిడ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సింగపూర్, హాంకాంగ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమయ్యామని పేర్కొంది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణుల సమీక్షా సమావేశం సోమవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జరిగింది. "దేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని సమావేశం తేల్చింది. మే 19 నాటికి దేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 257గా ఉంది. ఇది జనాభాను పరిగణనలోకి తీసుకుంటే చాలా తక్కువ. ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్య సమస్యలతోపాటు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులను పర్యవేక్షించాలని కోరారు" అని అధికార వర్గాలు తెలిపాయి.