Couple loses Rs 24 Lakh Due To Cyber Crime Tamilnadu : పిల్లలకు ఆడుకోవడానికి మొబైల్ ఫోన్లు ఇస్తే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు మీకు భారీ ఆర్థిక నష్టం కూడా తెచ్చిపెట్టొచ్చు! ఇలాంటి ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో జరిగింది. ఓ పిల్లాడు పొరపాటున చేసిన పనివల్ల రూ.24 లక్షలు కోల్పోయారు వారి తల్లిదండ్రులు. చిన్నారి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల క్రమంగా డబ్బులు పోగొట్టుకున్నారు.
ఇదీ జరిగింది
జిల్లాలోని తేవరం ప్రాంతానికి చెందిన శివనేసన్(42) స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆతడి భార్య నగలు తాకట్టు వ్యాపారం చేస్తోంది. ఇద్దరు తాము సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి బ్యాంకుకు వెళ్లి తమ డబ్బు భద్రంగా ఉందో లేదో చెక్ చేసుకునేవారు. అలాగే ఇటీవల తమ ఖాతాలను తనిఖీ చేయడానికి బ్యాంకుకు వెళ్లాడు శివనేసన్. తన సెల్‌ఫోన్ నంబర్‌కు లింక్ చేసిన మూడు బ్యాంకు ఖాతాల నుంచి తనకు తెలియకుండానే రూ.24.69 లక్షలు (రూ.24,69,600) విత్‌డ్రా అయినట్లు శివనేసన్ కనుగొన్నాడు. ఈ విషయపై బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాడు. తన బ్యాంకు ఖాతా నుంచి వేర్వేరు అకౌంట్లకు విడతల వారిగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుసుకున్నాడు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శివనేసన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా దంపతుల మొబైల్ చెక్ చేయగా, వారి పిల్లాడు ఫోన్లో తరచూ వీడియో గేమ్‌లు ఆడేవాడని తెలిసింది. అతడు అనుకోకుండా డౌన్లోడ్ చేసిన యాప్ ద్వారా సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలను పొందినట్లు తేలింది.
దంపతుల అకౌంట్ నుంచి మొత్తం 9 వేర్వేరు అకౌంట్లకు డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఓ ఖాతా పట్నా(బిహార్)కు చెందిన అర్జున్ కుమార్(22) పేరు మీద ఉన్నట్లు తెలిసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలం నేతృత్వంలోని ప్రత్యేక బృందం అర్జున్ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో ఈ డబ్బు దొంగతనానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అర్జున్ కుమార్ చెప్పాడు. కొందరు దుండగులు తన బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్ ఇస్తే డబ్బులు ఇస్తానన్నారని, అందుకే వారికి తన వివరాలు ఇచ్చినట్లు తెలిపాడు. తన స్నేహితులు చాలా మంది ఇలా మోసగాళ్లకు వివరాలు ఇచ్చినట్లు చెప్పాడు. విచారణ తర్వాత అర్జున్ కుమార్‌ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు.