Woman Self Harm Due To Vegetables : మార్కెట్లో భర్త కూరగాయలు కొనుగోలు చేసి తీసుకురాలేదని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు, భర్త- ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స అందిస్తుండగానే మరణించింది. రాజస్థాన్లోని థోల్పుర్ జిల్లాలో జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని కైథారి గ్రామానికి చెందిన రఘుబీర్ సింగ్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి అతడి భార్య లక్ష్మి ఫోన్ చేసి కూరగాయలు కొనుగోలు చేసి తీసుకురమ్మని చెప్పింది. కానీ రఘుబీర్ మర్చిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక, కూరగాయలు ఏవని అతడిని అడిగింది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
ఇంతలో కొద్దిసేపటి తర్వాత గదిలోకి వెళ్లి లక్ష్మి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అయితే ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. భర్త స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇంకా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.