Children Ate Dead Snake : చేప అనుకుని చనిపోయిన పామును కాల్చి తిన్నారు ఇద్దరు పిల్లలు. దీన్ని చివరి క్షణంలో గమనించిన ఆ చిన్నారుల తల్లి, వారిద్దరిని పాముల సంరక్షుడి వద్దకు తీసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ పాము విషపూరితమైనది కాకపోవడం వల్ల చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది.
ఇదీ జరిగింది
ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలోని రాంనగర్ సమీపంలోని పుచ్చడి నాయి గ్రామంలో ఓ కుటుంబం ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తూ జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు సోదరులు, చనిపోయిన పామును చేప అనుకుని కాల్చారు. దాన్ని తింటున్న సమయంలో అక్కడికి వచ్చిన బాలుర తల్లి, పామును లాక్కుని దూరంగా విసిరేసింది. చిన్నారులను కుటుంబసభ్యులు పాముల సంరక్షుడు తాలిబ్ హుస్సేన్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
'అందుకే చిన్నారులు సేఫ్!'
పాము కాటు వేస్తే ఉపయోగించే మూలికలను తాలిబ్ ఇద్దరు చిన్నారులకు ఇచ్చాడు. బాలురు తిన్న పాము విషపూరితమైనది కాదని తెలిపాడు. "పిల్లలు వారి సమీపంలో చనిపోయిన పామును చూసి చేప అని భావించారు. అనంతరం మంటల్లో కాల్చి తినడం ప్రారంభించారు. వారు పాము తల తినకపోవడం మంచిదైంది. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. పాములను చంపొద్దు. పాము కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయండి." అని పాముల సంరక్షకుడు తాలిబ్ తెలిపాడు. కాగా, చిన్నారుల కుటుంబం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి జీవనం సాగిస్తోంది.
'ఇలాంటి సందర్భాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లాలి'
చిన్నారుల పాము తిన్న ఘటనపై రామ్నగర్ జాయింట్ హాస్పిటల్ సీఎంఎస్ డాక్టర్ చంద్రా పంత్ స్పందించారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆమె చెప్పారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.
పామును తిని ఒకరి పరిస్థితి విషమం
అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవలే బిహార్లో జరిగింది. ఇద్దరు చిన్నారుల పామును మంటల్లో కాల్చి తినేశారు. అందులో ఒక చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆ తర్వాత చిన్నారి కోలుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.
చిన్నారికి పాముకాటు.. చికిత్స కోసం 10కి.మీ నడక.. హోటల్లో జంట మృతదేహాలు!
మనవడిపై పాము కాటు!.. సర్పాన్ని పట్టుకుని ఆస్పత్రికి తాత.. వైద్యులు ఏం చేశారంటే?