వీధి కుక్కలపై ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తాం: సీజేఐ జస్టిస్ గవాయ్
వీధుల్లో కుక్కలు కనిపించకుండా చూడాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు- పలువురు నుంచి వినతులు - పరిశీలిస్తానని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్

Published : August 13, 2025 at 12:11 PM IST
|Updated : August 13, 2025 at 2:53 PM IST
CJI On Delhi Stray Dogs Orders : దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను తాను పరిశీలిస్తానన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. దిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకుండా చూడాలని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా, పలువురు నుంచి వినతులు వచ్చాయి. సుప్రీంకోర్టు పున:పరిశీలించాలని సీజేఐకి విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ఉత్తర్వులను పరిశీలిస్తానని పేర్కొన్నారు.
అయితే వీధి కుక్కల దాడుల వల్ల దిల్లీ ఎన్సీఆర్‌ల పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను ఇటీవల పరిగణనలోకి తీసుకుంది జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం. విచారణ చేపట్టి ఎనిమిది వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. దిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది.
ఆ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని తెలిపింది. ఆ సమంయలో తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణ తెలిపాయి.
సుప్రీంకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు కేంద్ర మాజీమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ. ఆర్థిక నష్టాలతో పాటు జీవవైవిధ్యం దెబ్బతింటుందని తెలిపారు. దిల్లీలో ఉన్న 3 లక్షల వీధికుక్కల కోసం 3 వేల షెల్టర్లు కావాలని, వీటి ఏర్పాటుకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో దిల్లీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు, దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వచ్చిన మానవీయ, సైన్స్ ఆధారిత విధానాల నుంచి వెనకడుగు వేసినట్లుగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆదేశాలను పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తూ సినీనటుడు అడివి శేష్ సీజేఐకి లేఖ రాశారు. జాన్ అబ్రహాం, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ ఆనంద్ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉత్తర్వులను పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు.

