EVM Is Completely Safe : భారతదేశంలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు పూర్తిగా సురక్షితమని, వాటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. యూఎస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ తులసీ గబార్డ్, కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సుర్జేవాలా ఈవీఎంల విశ్వసనీయతమై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ విధంగా స్పందించారు.
"భారతదేశంలో వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) పూర్తిగా సురక్షితం. ఇవి ఇంటర్నెట్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్‌కి కనెక్ట్ కావు. కనుక వాటిని హ్యాక్ చేయడం, ట్యాంపర్ చేయడం సాధ్యం కాదు. మీరు ఓటు వేసినప్పుడు, వీవీపాట్ (VVPAT) స్లిప్ వస్తుంది. ఇప్పటి వరకు ఈవీఎంల్లో నమోదైన ఓట్లకు, వీవీపాట్‌లో వచ్చిన స్లిప్‌లకు మధ్య ఎలాంటి తేడా కనిపించలేదు. అంతేకాదు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా, సురక్షితంగా ఉండేలా భారత ఎన్నికల సంఘం చూసుకుంటుంది."
- జ్ఞానేశ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్
ప్రతి ఓటర్ సరైన సమాచారాన్ని పొందేలా, పూర్తి భద్రతతో, పారదర్శకతతో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడం ఎన్నికల కమిషన్ ప్రథమ ప్రాధాన్యత అని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగా ఓటర్‌గా మారాలని ఆయన సూచించారు. ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న సీఈసీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్ట్ సుమోటోగా తీసుకోవాలి : కాంగ్రెస్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం)లను హ్యాకింగ్ చేయవచ్చని, దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఇటీవలే అమెరికా జాతీయ నిఘా విభాగం అధిపతి తులసీ గబార్డ్ అన్నారు. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం తమ నిజాయితీని కచ్చితంగా నిరూపించుకోవాలని పేర్కొంది. "త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న వేళ ఈవీఎంలపై కలుగుతున్న సందేహాలకు ఎలక్షన్ కమిషన్ జవాబుదారీగా వ్యవహరించాల్సిన సమయమిది" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా అన్నారు.