Blind Woman Climbed Mount Everest : ఆమెకు కంటిచూపు లేదు. అయితేనేం గొప్ప జీవిత లక్ష్యం ఉంది. ఏదైనా సాధించాలనే బలమైన కుతూహలం ఉంది. ఇవే ఆ ధీర వనితను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టును ఎక్కించాయి. చూపులకు ఏమీ చూసే శక్తి లేకపోయినా.. ఆత్మస్థైర్యంతో 8,848 మీటర్ల దూరాన్ని నడిచే బలం తనకు ఉందని 29 ఏళ్ల ఛోంజిన్ ఆంగ్మో నిరూపించారు. ఎవరెస్టును అధిరోహించిన తొలి అంధ మహిళగా రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం చాంగోకు చెందిన ఛోంజిన్ ఆంగ్మోపై ఈటీవీ భారత్ స్ఫూర్తిదాయక కథనమిది.
ఎవరెస్టుపై ఛోంజిన్ ఆంగ్మో ఉద్వేగం
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంటే ఎలా ఉంటుందో ఛోంజిన్ ఆంగ్మో సాధించిన విజయాన్ని చూస్తే తెలుస్తుంది. మంచి కంటి చూపు కలిగిన వాళ్లే ఎవరెస్టును ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొంతమందైతే ఈ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఛోంజిన్ ఆంగ్మో ఇలాంటివేం పట్టించుకోలేదు. తనకు కంటిచూపు లేదనే విషయాన్ని కూడా ఆమె మర్చిపోయారు. బ్లైండ్‌గా ఎవరెస్టును ఎక్కేశారు. దండు షెర్పా, గురుంగ్ మైలాలతో కలిసి మే 19న(సోమవారం) ఉదయం 8.30 గంటలకు ఎవరెస్టు శిఖరాగ్రంపైకి ఛోంజిన్ ఆంగ్మో చేరుకున్నారు. దానిపై మువ్వన్నెల భారత జెండాను ఎగరేసి, ఆమె ఉద్వేగంతో ఉప్పొంగిపోయారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించారు. ఎవరెస్టు ఎక్కాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కలలు కంటుంటారు. వాళ్లందరి ఎదుట ఆశాజ్యోతిలా ఛోంజిన్ ఆంగ్మో వెలుగులు విరజిమ్మారు.


మూడో తరగతిలో కంటి చూపును కోల్పోయాక!
ఛోంజిన్ ఆంగ్మోకు ఈ విజయం రాత్రికి రాత్రి దక్కలేదు. తలుచుకున్న వెంటనే ఈ స్వప్నం సాకారం కాలేదు. జీవిత ప్రస్థానంలో ఎన్నో కష్టాలు, అవరోధాలు, సవాళ్లను ఆమె దాటుకొని వచ్చారు. మూడో తరగతి చదువుతుండగా ఎనిమిదేళ్ల వయసులోనే ఛోంజిన్ ఆంగ్మో కంటి చూపును కోల్పోయారు. అయినా ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యం, దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. కంటిచూపు పోయిన తర్వాత ఛోంజిన్ ఆంగ్మోను తల్లిదండ్రులు చండీగఢ్‌లోని ఓ పాఠశాలలో చేర్పించారు. అనంతరం ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంఏ హిస్టరీలో పీజీ చేశారు. 2024లో క్యావిన్ కేర్ ఎబిలిటీ అవార్డును అందుకున్నారు. దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్నందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి కూడా ఛోంజిన్ ఆంగ్మో పురస్కారాన్ని పొందారు. ఇక లేహ్‌లో ఉన్న మహాబోధి స్కూల్‌లో చేరి పర్వతారోహణను ఛోంజిన్ ఆంగ్మో నేర్చుకున్నారు. ఏదో ఒకరోజు తప్పకుండా ఎవరెస్టును ఎక్కాలనే బలమైన లక్ష్యాన్ని ఛోంజిన్ ఆంగ్మో పెట్టుకున్నారు. ఎట్టకేలకు దాన్ని సాకారం చేశారు. తానేంటో ప్రపంచానికి చాటి చెప్పారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ!
ప్రస్తుతం ఛోంజిన్ ఆంగ్మో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా ఉన్నారు. దీంతో ఆమె ఎవరెస్టు యాత్రకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్పాన్సర్‌షిప్‌ను అందించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రేరణ, మద్దతు వల్లే తాను ఎవరెస్టు ఎక్కానని ఛోంజిన్ ఆంగ్మో చెప్పుకొచ్చారు. ఛోంజిన్ ఆంగ్మో సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఒక పోస్ట్ చేసింది. ఎవరెస్టు శిఖరాగ్రంపై ఛోంజిన్ ఆంగ్మో ఉన్న ఫొటోను ఆ పోస్ట్‌కు జతపర్చింది. ఆమె సాధించిన విజయాన్ని చూసి కుటుంబం, గ్రామం, రాష్ట్రం, యావత్ దేశం గర్విస్తున్నాయి. ఛోంజిన్ ఆంగ్మోను అభినందిస్తూ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆమె సాధించిన ఘనతను చూసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం గర్వపడుతున్నాయని పేర్కొన్నారు.
किन्नौर ज़िला के चांगो गांव निवासी छोंजिन अंगमो जी ने माउंट एवरेस्ट की चोटी पर विजय पताका फहराकर हिमाचल प्रदेश का नाम पूरे देश और पूरी दुनिया में गौरवान्वित किया है।
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) May 24, 2025
दृष्टिबाधित छोंजिन अंगमो जी ने अपार साहस और अटूट संकल्प से दुनिया को दिखा दिया कि कोशिश करने वालों की कभी हार… pic.twitter.com/2l5nsnb1hw
శభాష్ 'ఎవరెస్ట్ మ్యాన్'!- 29వసారి ఎవరెస్టును అధిరోహించిన కమీ రీటా - Kami Rita Climbs Mt Everest
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ఆరేళ్ల బాలుడు- దుబాయ్ నుంచి జర్నీ ఇలా! - Mount Everest Base Camp Trekking