Bulldozer Action In Nagpur : నాగ్‌పుర్‌లో ఇటీవల చెలరేగిన హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీమ్‌ఖాన్‌కు చెందిన అక్రమ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. సోమవారం ఉదయం అతడి రెండతస్థుల నివాసంతో పాటు మరికొన్ని అక్రమ నిర్మాణాలను నాగ్‌పుర్ మున్సిపల్‌శాఖ అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందు వల్ల వాటిని కూల్చివేశామన్నారు.
యశోధరనగర్ సంజయ్ బాగ్ కాలనీలో ఉన్న ఫహీమ్ ఇల్లు ఆయన తల్లి పేరున రిజిస్టరైనట్టు అధికారులు తెలిపారు. భవనానికి ఎటువంటి మంజూరు ప్రణాళిక లేదని, మొత్తం నిర్మాణం అనధికారికంగా జరిగిందని పేర్కొన్నారు. ఎంఆర్టీపీ చట్టం కింద కూల్చివేసినట్టు తెలిపారు. ఇక కూల్చివేత జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. డ్రోన్లతో ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ లోనికి రాకుండా చర్యలు తీసుకున్నారు.
#WATCH | Maharashtra: House of Nagpur violence accused Faheem Khan being demolished in Nagpur. Police personnel are present at the spot. pic.twitter.com/RKzAFCokED
— ANI (@ANI) March 24, 2025
మార్చి 17న నాగ్‌పుర్‌లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మతపరమైన వస్తువులు దహనం చేసినట్లు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారాన్ని, వదంతులను వ్యాప్తి చేయడం వల్ల ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫహీమ్‌ఖాన్ సహా ఆరుగురిపై దేశద్రోహం కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 200 మంది నిందితులను గుర్తించామని, మరో వెయ్యి మందిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
మరోవైపు, మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఇంతకుముందు పలు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో ఔరంగజేబు సమాధి వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఔరంగజేబు స్మారకానికి ఇరువైపుల ఇనుప రేకులను, కంచెను ఏర్పాటు చేశారు.