Sambalpur Kamli Bazaar Market : 'కమ్లీ బజార్' ఒడిశాలోని సంబల్‌పూర్ పట్టణంలో ప్రతీ ఆదివారం ఏర్పాటయ్యే చారిత్రక వీక్లీ మార్కెట్. 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్కెట్ ఏర్పాటు వెనుక పెద్ద చరిత్ర ఉంది. వీరోచిత స్వతంత్య్ర పోరాట ఘట్టంతో పెల్లుబికిన ప్రజాగ్రహం ఉంది. 'కమ్లీ' అనే పదానికి ఇంగ్లీష్‌తో సంబంధం లేకపోయినప్పటికీ, ఒక బ్రిటీష్ అధికారి పేరిట ఈ మార్కెట్ ఏర్పాటయింది. సదరు బ్రిటీష్ అధికారి కమ్లీ బజార్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు ? తన పేరును ఎందుకు పెట్టుకున్నారు ? ఈ వీక్లీ మార్కెట్ విశేషాలు ఏమిటి ? తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
స్వాతంత్య్ర సమరయోధులపై చర్యలు
కమ్లీ బజార్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మనం 1864 సంవత్సరంలోకి వెళ్లాలి. ఆ ఏడాదిలో సంబల్‌పుర్ డిప్యూటీ కమిషనర్‌గా బ్రిటీష్ అధికారి అలెగ్జాండర్ బుల్‌స్ట్రోడ్ కంబర్‌లెడ్జ్ ఉన్నారు. ఆయన పేరును పలకలేక స్థానికులు 'కమ్లీ సాహెబ్' అని పిలిచేవారు. అప్పట్లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సురేంద్ర సాయి, ఆయన సహచరులను అరెస్టు చేసి శిక్ష విధించారు. ఆ తర్వాత వీర్ సురేంద్ర సాయి జైలులో మరణించారు. దీంతో సంబల్‌పుర్ ప్రాంతంలో బ్రిటీషర్లపై ప్రజలకు ఆగ్రహం పెరిగిపోయింది.
ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి బ్రిటీష్ అధికారి అలెగ్జాండర్ బుల్‌స్ట్రోడ్ కంబర్‌లెడ్జ్ ఒక ఆలోచనను అమలు చేశారు. ప్రజల సౌకర్యార్ధం సంబల్‌పూర్ నగరంలో ఆయన వారసంతను ప్రారంభించారు. దానికి తన పేరునే 'కమ్లీ సాహెబ్ మార్కెట్' పెట్టుకున్నారు. స్థానికులకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే మార్కెట్‌కు తన పేరును అలెగ్జాండర్ బుల్‌స్ట్రోడ్ కంబర్‌లెడ్జ్ పెట్టుకున్నారట. కాలక్రమంలో అందరూ దీన్ని 'కమ్లీ బజార్' అని పిలవసాగారు. సంబల్‌పూర్‌లోని కుంజల్ పడా చాక్ నుంచి సామలేశ్వరి ఆలయానికి వెళ్లే రహదారి వరకు ఉన్న ప్రాంతాన్ని కమ్లీ బజార్ అంటారు. అప్పట్లో ఈ వీక్లీ మార్కెట్‌లో పశువులు, గుర్రాలను కూడా అమ్మేవారట. 25 ఏళ్ల క్రితం వరకు కూడా 'కమ్లీ బజార్' లో పశువులను విక్రయించారు. ఇప్పుడది ఆగిపోయింది.

పెళ్లిళ్ల షాపింగ్‌కు వన్‌స్టాప్ మార్కెట్
పెళ్లి అంటే మామూలు విషయమా! షాపింగ్ కోసం చాలాచోట్ల తిరగాలి. ప్రత్యేకించి వధువు తరఫు వాళ్లకు ఎడతెరిపి లేని రేంజులో షాపింగ్ ఉంటుంది. వస్త్రాలు, గాజులు, నగలు, ఫర్నీచర్, పల్లకీలు ప్రతీదాని కోసం వేర్వేరు సార్లు షాపింగ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకేచోట అందించడమే 'కమ్లీ బజార్' ప్రత్యేకత. ఈ మార్కెట్ ప్రతి ఆదివారం జనంతో కిటకిటలాడుతుంది. ప్రత్యేకించి పెళ్లిళ్ల సీజన్‌లో ఈ మార్కెట్‌కు రద్దీ బాగా పెరుగుతుంది. ఈ మార్కెట్‌లో వివిధ వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్న వ్యాపారులు అందరికీ పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉంది. వారి కుటుంబాలు బ్రిటీష్ కాలం నుంచీ కమ్లీ బజార్ వీక్లీ మార్కెట్‌లో దుకాణాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ వ్యాపారుల కుటుంబాలన్నీ సంబల్‌పుర్, పరిసర గ్రామాల్లో నివసిస్తుంటాయి. ప్రతీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సంత ఉంటుంది. పెళ్లిళ్లకు అవసరమైన సకల సామగ్రిని ఒకేచోట అందించే మార్కెట్‌గా దీనికి పేరొచ్చింది. స్థానికులు ఈ మార్కెట్‌ను 'కమ్లీ బజార్' హాట్ అని పిలుస్తారు. ఒడియా భాషలో 'హాట్' అంటే గ్రామీణ సంత అని అర్థం.

కమ్లీ బజార్‌లో ఏమేం దొరుకుతాయి ?
కమ్లీ బజార్ వీక్లీ మార్కెట్‌లో ఇనుప సామాన్లు, కలప గృహోపకరణాలు, బెడ్‌లు, సోఫాలు, వెదురు ఉత్పత్తులు, బంగారం, వెండి ఆభరణాలు, చీరలు, సూట్‌లు, స్టీల్ అల్మారాలు, అన్ని రకాల ఫర్నిచర్లు, వస్త్రాలు లభిస్తాయి. వీటితో పాటు కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, మట్టి కుండలు, సౌందర్య సాధనాలు దొరుకుతాయి.
'ప్రజలకు చేరువ కావాలనే'
సంబల్‌పూర్ ప్రజలకు చేరువ కావాలని బ్రిటీష్ అధికారి అలెగ్జాండర్ బుల్‌స్ట్రోడ్ కంబర్‌లెడ్జ్ భావించారని సంబల్‌పుర్‌కు ప్రముఖ చరిత్రకారుడు దీపక్ పాండా 'ఈటీవీ భారత్'కు తెలిపారు. 'అందుకే ఆయన తన పేరుతో నగరంలో వీక్లీ మార్కెట్‌ను ఏర్పాటు చేయించారు. స్థానికులకు ఈ మార్కెట్ ద్వారా ఉపాధిని, సౌకర్యాన్ని అందించాలని అలెగ్జాండర్ బుల్‌స్ట్రోడ్ కంబర్‌లెడ్జ్ అనుకున్నారు. ఆ మార్కెటే నేటికీ కొనసాగుతోంది' అని దీపక్ పాండా వివరించారు.

తాతల కాలం నుంచి దుకాణం నడుపుతున్నాం : అబ్దుల్ రషీద్ ఖాన్, వ్యాపారి
'నేను చిన్నప్పటి నుంచి కమ్లీ బజార్‌ను చూస్తున్నాను. మేం ఇక్కడ తాతల కాలం నుంచి షూ దుకాణాన్ని నడుపుతున్నాం. పెళ్లికి అవసరమైన సకల సామగ్రి ఈ వీక్లీ బజార్‌లో దొరుకుతుంది. దీనివల్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. సమయం ఆదా అవుతుందిట అని వ్యాపారి అబ్దుల్ రషీద్ ఖాన్ ఈటీవీ భారత్‌కు చెప్పారు.
అందుకే స్పెషల్
సంబల్‌పూర్ నగరంలో దొరకని చాలా వస్తువులు మార్కెట్‌లో దొరుకుతాయని, అందుకే జనం ఈ వారసంతకు తరలివస్తారని సంబల్‌పుర్‌కు చెందిన గీతేశ్వరి బెహెరా తెలిపారు. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయని, తనకు పుట్టక ముందు నుంచే ఈ మార్కెట్ ఉందని చెప్పారు. 'కమ్లీ బజార్' చాలా పాతదని, ఈ మార్కెట్ రోడ్డు పక్కన ఉన్నందున, దీన్నిపెద్దగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని సంబల్‌పుర్‌కు చెందిన రమేశ్ కుమార్ పురోహిత్ తెలిపారు. దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులకు ప్రభుత్వం తగిన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు.