Bride Dies Before Wedding : ఉత్తరప్రదేశ్ బెహేరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ పెళ్లింటిలో హృదయ విదారక ఘటన జరిగింది. పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందు వధువు ప్రాణాలు కోల్పోయింది. వివాహ ఊరేగింపు సమయంలో ఆకస్మికగా అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. వధువు ఆకస్మిక మరణంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. మరోవైపు డాక్టర్ నిర్లక్ష్యం వల్లే వధువు మరణించిదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆకస్మిక అనారోగ్యం
థాన్ సింగ్ అనే వ్యక్తి కుమార్తె శాంతికి(20) బుధవారం సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. అందుకు సిద్దమవుతుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. తనకు నీరసంగా, భయంగా, ఆందోళనగా ఉందని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు బహేరి పట్టణంలోని ఒక డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతుండగా శాంతి పరిస్థితి మరింత విషమించింది. కొంత సేపటికే మరణించింది. అయితే డాక్టర్ తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారని, అందుకే శాంతి చనిపోయిందని ఆమె తండ్రి థాన్ సింగ్ ఆరోపించాడు.
తన కూతురు శాంతి బలహీనంగా ఉందని, సెలైన్ పెట్టామని, త్వరగానే కోలుకుంటుందని డాక్టర్ చెప్పినట్లు వధువు తండ్రి తెలిపారు. అయితే సెలైన్ ఇచ్చిన తర్వాత ఆమె పరిస్థితి వేగంగా క్షీణించిందని చెప్పారు. డాక్టర్ ఆమెను బరేలీలోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించినట్లు పేర్కొన్నారు. ఇంతలోనే శాంతి ప్రాణాలు కోల్పోయిందని అన్నారు
డాక్టర్‌పై కేసు నమోదు
శాంతి ఆకస్మిక మరణంతో గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బెహేరి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపారు. థాన్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని బెహేరి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ సంజయ్ తోమర్ చెప్పారు.
పెళ్లి సందడి బదులు విషాద ఛాయలు
శాంతి వివాహానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్న దేవిపుర గ్రామాన్ని ఒక్కసారిగా విషాదం ఆవహించింది. వివాహ అతిథుల కోసం వంటవారు వివిధ వంటకాలు కూడా సిద్ధం చేశారు. నవాబ్‌గంజ్ నుంచి వివాహ ఊరేగింపు రాక కోసం గ్రామం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శాంతి మరణ వార్త తెలియడం వల్ల అందరూ దుఃఖంలో మునిగిపోయారు. వివాహ ఊరేగింపు సగం దూరం నుంచే తిరిగి వారి గ్రామానికి వెళ్లిపోయారు.