BJP On Waqf Board Act : వక్ఫ్ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణలపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ముస్లింల వద్దకు వెళ్లి వక్ఫ్ సవరణ చట్టాన్ని వివరించనుంది. ఈ మేరకు దిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సహా ఇతర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం సహా వక్ఫ్ చట్ట సవరణలపై ముస్లిం సామాజిక వర్గాలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
"వక్ఫ్ భూముల ప్రయోజనాలు పేద ముస్లింలకు అందాలనే సవరణలు తీసుకువచ్చాం. ఫలితంగా పేద ముస్లింల విద్యా, వైద్యం మెరుగుపడుతుంది. కాంగ్రెస్ సహా దాని మిత్ర పక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. వక్ఫ్ చట్టంపై ముస్లింలలో దుష్ప్రచారం చేస్తుంది. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలి. ముస్లింల ఇళ్లకు వెళ్లి ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలి. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టాలి."
--జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
ప్రతి రాష్ట్రం నుంచి మైనార్టీ మోర్చా సహా అధ్యక్షుడు నలుగురు నేతలను ఆహ్వానించి వారికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం వల్ల ముస్లిం సమాజానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని యోచిస్తోంది.
కాగా, ఇటీవలె పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం (ఏప్రిల్ 8) నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది.
మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలతో పాటు ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం 15 పిటిషన్లు దాఖలు కాగా, వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 16న విచారణ జరగనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కేవియట్‌ను దాఖలు చేసి, తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయొద్దని కోరింది.