Father And Children Suicide : బిహార్‌కు చెందిన ఓ తండ్రి తన నలుగురు పిల్లలతో హరియాణాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫరీదాబాద్‌లోని బల్లభ్‌గఢ్ రైల్వే ట్రాక్‌పై ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు కనపడడం కలకలం రేపింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బల్లభ్‌గఢ్ రైల్వే ట్రాక్ సమీపంలో ఐదు మృతదేహాలు ఉన్న పోలీసలకు సమాచారం అందింది. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రైల్వే ట్రాక్‌పై ఐదు మృతదేహాలను గుర్తించారు. ఒకరు పెద్దవారు కాగా, పిల్లల వయసు 3-9 ఏళ్ల మధ్యలో ఉంటుందని నిర్ధరించారు. GRP పోలీసులతో కలిసి మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
తండ్రి జేబులో ఒక స్లిప్‌తోపాటు ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక ఫోన్ నంబర్ ఉండగా, ఆధార్ కార్డులో పేరు మనోజ్ మహతో అని రాసి ఉన్నట్లు గుర్తించారు. స్లిప్‌లో ఉన్న నంబర్‌ను కాల్ చేయగా, ఒక మహిళ లిఫ్ట్ చేసిందని పోలీసులు తెలిపారు. మనోజ్ తెలుసా అని అడిగితే, తన భర్త అని చెప్పిందని వెల్లడించారు. తన పిల్లలను తీసుకుని పార్క్‌కు వెళ్లారని చెప్పిందని పేర్కొన్నారు.
"అప్పుడు జరిగిన ఘటన గురించి వెంటనే రైల్వే ట్రాక్ దగ్గరకు రావాలని చెప్పాం. ఆ తర్వాత కాసేపటికే ఆమె వచ్చింది. మృతదేహాన్ని గుర్తించింది. మొత్తానికి అది బలవన్మరణమని గుర్తించాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మనోజ్ మహతో బిహార్ నివాసి. ఇక్కడే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ప్రస్తుతం బలవన్మరణానికి కారణం తెలియదు. దర్యాప్తు తర్వాతే అసలు విషయం బయటపడుతుంది" అని పోలీసులు తెలిపారు.
డిస్క్లైమర్: మీరు ఎప్పుడూ అలాంటి అడుగు వేయకూడదని ETV భారత్ మీకు విజ్ఞప్తి చేస్తుంది. కొన్నిసార్లు జీవితంలో ఆనందం వస్తుంది. కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా కారణం వల్ల నిరాశలో ఉంటే, వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించండి.