Bengaluru Stampede : ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యవర్గ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తమపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, పలువురు ఆఫీస్ బేరర్లకు భారీ ఊరట లభించింది.
వీరితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు అరెస్టు నుంచి రక్షణ లభించింది. ఈ పిటిషన్లర్లు అందరూ కోర్టు ప్రాదేశిక పరిధిని దాటి వెళ్లొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఆర్ కృష్ణ కుమార్ నిర్దేశించారు. ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తే తప్పకుండా కోర్టు అనుమతిని తీసుకోవాలన్నారు. కేసు విచారణకు సహకరించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అధికారులకు ఆయన సూచించారు. ‘‘తదుపరి విచారణ తేదీ (జూన్ 16) వరకు కేఎస్‌సీఏ మేనేజ్‌మెంట్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు. అయితే వారంతా విచారణకు సహకరించాల్సి ఉంటుంది’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
వాదనలు ఇలా సాగాయి
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శశికిరణ్ వాదనలు వినిపించారు. ‘ఈ కేసుపై దర్యాప్తు ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఇప్పటికిప్పుడు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయబోరని హైకోర్టుకు తెలిపారు. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌ను అరెస్టు చేశారని న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ వాదనను అడ్వకేట్ జనరల్ శశికిరణ్ కౌంటర్ చేస్తూ ఒక నిందితుడిని ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారని, అతడు దుబాయ్‌కు పారిపోయేందుకు యత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆర్సీబీ, డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎస్‌సీఏ నిర్వాహకులు, ప్రతినిధులను అరెస్టు చేస్తామని స్వయంగా సీఎం సిద్ధరామయ్య గురువారం ప్రకటించారని పిటిషనర్ న్యాయవాది గుర్తుచేశారు. ఈ వాదనలన్నీ విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఆర్ కృష్ణ కుమార్ పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేశారు.
ముగ్గురిపై కేసులు
జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవానికి ముందు సంభవించిన తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 56 మంది గాయాలపాలయ్యారు. ఈ కార్యక్రమ నిర్వాహకులైన ముగ్గురిపై నేరపూరిత నిర్లక్ష్యం అభియోగంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కర్ణాటక ఇంటెలీజెన్స్ ఏడీజీపీ బదిలీ
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కర్ణాటక ఇంటెలీజెన్స్ విభాగం ఏడీజీపీ హేమంత్ నింబాల్కర్‌ను శుక్రవారం బదిలీ చేసింది. దీనిపై ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారానికి సంబంధించి బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద, నలుగురు ఇతర సీనియర్ పోలీసు అధికారులను గురువారం రోజే సీఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని సీఎం వ్యాఖ్యానించారు.
సీఎం సిద్దరామయ్య రాజకీయ కార్యదర్శి గోవిందరాజ్‌పై వేటు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కె.గోవిందరాజ్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే గోవిందరాజ్ తొలగింపునకు గల కారణాలను అధికారిక ప్రకటనలో ప్రస్తావించలేదు. జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో కె.గోవిందరాజ్‌పై చర్యలకు సంబంధం ఉందనే చర్చ జరుగుతోంది.