BENGALURU HEAVY RAINS: బెంగళూరులో గత మూడు రోజులు వర్షాలు దంచికొడుతన్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో గోడ కూలి 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. అలాగే ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలువురి ఇళ్లు, కార్యాలయాల్లోకి వరదనీరు చేరింది. పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అవ్వడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఒక పక్క డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దై పోయింది.
శాంతినగర్‌లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) కార్యాలయం వర్షపు నీటిలో మునిగిపోయింది. పలు కీలక పత్రాలు నీటిలో తడిసిముద్దాయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా సీసీబీని చామరాజ్‌పేట్ నుంచి శాంతినగర్‌కు మార్చారు. కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో మోకాల మంటు నీరు చేరింది.


బెంగళూరులో ఇప్పటివరకు అత్యంత వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో హోరామావులోని సాయి లేఅవుట్ ఒకటి. శనివారం కురిసిన వర్షానికి లేఅవుట్లో 4 నుంచి 5 అడుగుల నీటిలో మునిగిపోయింది, దీని వల్ల వీధుల్లో మోకాళ్ల లోతు నీరు చేరిందని అధికారులు తెలిపారు. హోరామావు, కావేరీనగర్, సంపంగి రాంనగర్ సహా అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. నీటిని తొలగించడంలో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మూసుకుపోయిన డ్రైనేజీలను బాగుచేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు వాటిని శుభ్రం చేయలేదని నగరవాసులు పేర్కొన్నారు.
బెంగళూరులో గత 24 గంటల్లో నగరంలో దాదాపు 104 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపవడం వల్లే తీవ్ర నష్టం జరిగినట్లు ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. బీజేపీ చేసిన విమర్శలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. వర్షాల సమయంలో బెంగళూరులో ఈ ఇబ్బందులు కొత్తేమీ కాదని చెప్పారు. తమ ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తోందని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి అశ్వత్ నారాయణ్ గౌడ మాట్లాడుతూ, వారం క్రితం భారీ వర్షపాతం ఉంటుందని ఐఎండీ హెచ్చరించినా, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. వర్ష బీభత్సానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యత తీసుకోవాలని విమర్శించారు.
బెంగళూరుతో మ్యాచ్ వర్షార్పణం- ప్లే ఆఫ్స్ నుంచి కోల్‌కతా ఔట్!
రెండు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు - వాతావరణ కేంద్రం వెల్లడి