UP CM On Bengal Violence : ముర్షిదాబాద్‌లో విధ్వంసం జరుగుతున్నా బంగాల్ ప్రభుత్వం మౌనంగా ఉందని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. లౌకికవాదం పేరిట విధ్వంసం సృష్టించడానికి ఆందోళనకారులకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో 650 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన యోగి, బంగాల్లో జరుగుతున్న ఆందోళనలపై తనదైన శైలిలో స్పందించారు.
మూర్ఖులకు మాటలతో ఎలా నచ్చజెప్పగలమని ప్రశ్నించారు. ఆందోళనకారులకు లాఠీ దెబ్బలే సరైనవని అన్నారు. ఆందోళనకారులు ప్రజలను భయపెడుతూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్నవాటికి మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలన్నారు. వక్ఫ్ నుంచి స్వాధీనం చేసుకునే భూములను ఆస్పత్రులు, పాఠశాలలు, ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తామని యోగి తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం-2025తో భూముల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. అందుకే కొందరు ఆందోళన చెంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
#WATCH | Hardoi: While speaking on the violence in West Bengal, UP CM Yogi Adityanath says, " ...everyone is silent. congress is silent over the murshidabad riots. samajwadi party (sp) is silent. tmc is silent. they are issuing threats after threats. they are shamelessly… pic.twitter.com/xQNnS1nV9E
— ANI (@ANI) April 15, 2025
"2017కు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడు,నాలుగు రోజులకు ఒకసారి అల్లర్లు జరిగేవి. అల్లర్లకు పాల్పడే వారికి లాఠీ దెబ్బలే సరైనవి. లేకపోతే వారు(ఆందోళనకారులు) మాట వినరు. బంగాల్లో విధ్వంసం జరుగుతున్నా ఆ రాష్ట్ర సీఎం మౌనంగా ఉన్నారు. ఆందోళనకారులను ఆమె(మమత) శాంతి దూతలుగా పిలుస్తోంది. మూర్ఖుడికి మాటాలతో ఎలా నచ్చజెప్పగలం? లౌకికవాదం పేరిట ఆందోళనలు చేయడానికి అనుమతి ఇచ్చారు. వారం రోజుల నుంచి ముర్షిదాబాద్‌లో ఆందోళనలు జరుగుతుంటే అక్కడి ప్రభుత్వం మౌనంగా ఉంది. అలాంటి ఆందోళనలను నియంత్రించాలి. ముర్షిదాబాద్ అల్లర్లపై కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మౌనంగా ఉన్నాయి. ఆందోళనకారులు ప్రజలను భయపెడుతున్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న వాటికి మద్దతిస్తున్నారు"
- యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్
వక్ఫ్ చట్టం గతవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శనివారం బంగాల్‌లోని మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై మమత మాట్లాడుతూ, ఈ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. అయితే ఈ హింసలో ఉగ్రసంస్థల హస్తం ఉందని వారే యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.