Ban Turkey Movement in India : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి అండగా నిలిచిన తుర్కియేకు సెగ తగులుతోంది. ఆ దేశంపై ప్రభావం పడేలా నిర్ణయాలను భారత సంస్థలు తీసుకుంటున్నాయి. భారత్‌లోని వివిధ విమానాశ్రయాల్లో భద్రతా పరమైన సేవలందిస్తున్న తుర్కియే సంస్థ సెలెబి ఏవియేషన్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్రం రద్దు చేసింది. భారతీయ విమానాశ్రయాలలో సరుకుల రవాణాతోపాటు, బహువిధ సేవలు అందిస్తున్న తుర్కియే కంపెనీ సెలిబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌కు అనుమతులను భద్రతాపరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్లు పౌరవిమానయాన భద్రత మండలి-BCAS ప్రకటించింది.
హైదరాబాద్, చెన్నైలతో సహా మొత్తం 9 భారతీయ విమానాశ్రయాల్లో సెలిబి సేవలు అందిస్తోంది. అయితే, ఒప్పందం రద్దు నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణికుల, సరకు రవాణాకు ఏర్పాట్లు చేసినట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. ఈ క్రమంలోనే స్పందించిన పలు విమానాశ్రయాలు సెలెబి సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. ముంబయి ఛత్రపతి శివాజీ అంతార్జాతీయ విమానాశ్రయం, అహ్మాదాబాద్ సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రద్దు చేసుకున్నట్లు ప్రకటనను విడుదల చేశాయి.
Following the Government of India's decision to revoke Celebi's security clearance, we have terminated the ground handling concession agreements with Celebi at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport (CSMIA) and Ahmedabad's Sardar Vallabhbhai Patel… pic.twitter.com/sGk9WYpqiR
— ANI (@ANI) May 15, 2025
'తమది తుర్కియే సంస్థ కాదు'
సెలెబి ఏవియేషన్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేయడంపై ఆ సంస్థ స్పందించింది. ముఖ్యంగా ఓనర్‌షిప్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. తమది అసలు తుర్కియేక సంబంధించిన సంస్థే కాదని వెల్లడించింది. సంస్థలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తెకు భాగం ఉందంటూ వచ్చిన వార్తలను తప్పుబట్టింది. ఆమెకు కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఒప్పందాలు రద్దు
కాగా ఇప్పటికే పలు యూనివర్సిటీలు కూడా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. తుర్కియేలోని విద్యాసంస్థతో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని తెలంగాణ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం రద్దు చేసుకుంది. యూనస్ ఎమ్రే సంస్థతో విద్యాపరమైన అవగాహనా ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు తుర్కియేలోని వివిధ విద్యాసంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేసినట్లు దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం కూడా తెలిపింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సైతం ఇదే బాటలో నడిచింది.
బుకింగ్స్ రద్దు చేసిన ట్రావెల్ ఏజెన్సీలు
ఇటీవలె పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వేళ దాయాది దేశానికి తుర్కియే మద్దతుగా నిలిచింది. డ్రోన్లు, క్షిపణులను పాకిస్థాన్‌కు అందించిన ఆ దేశంపై భారత్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ట్రావెల్ ఏజెన్సీలు సైతం అక్కడికి బుకింగ్‌లు నిలిపివేశాయి. అక్కడి నుంచి వచ్చే యాపిళ్ల దిగుమతి సహా ఇతర వస్తువులపై పూర్తిగా నిషేధించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తుర్కియే యాపిల్స్ నిషేధించాలి- వాటిపై 100 శాతం దిగుమతి సుంకం వేయాల్సిందే- ప్రధాని మోదీకి రైతుల లేఖ
దేశంలో 'బ్యాన్ తుర్కియే' ట్రెండ్- రూ.1000 కోట్ల వ్యాపారంపై ప్రభావం! పాక్‌కు సపోర్ట్ ఇచ్చినందుకే