
మరుగుజ్జు ఆవులు పెంచుతున్న అక్కాచెల్లెళ్లు- పశువుల కోసం ప్రత్యేకంగా మ్యూజిక్, FM!
మరుగుజ్జు ఆవులను పెంచుతున్న విద్యార్థులు

Published : October 12, 2025 at 4:43 PM IST
Kasargod Dwarf Cow Farming : ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఆవులను పెంచుతున్నారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఒకప్పుడు పశువుల పాక మొత్తం ఆవులతో నిండి ఉండేది. ఒక దశలో ఆవలు లేక పాక ఖాళీగా ఉండేది. కొవిడ్ సమయంలో తీసుకున్న నిర్ణయంతో మళ్లీ ఆవులు పెంచడం ప్రారంభించారు. అయితే ఈ సారి మరుగుజ్జు ఆవులను పెంచుతున్నారు. వాటి కోసం రోజంతా ఎఫ్ఎం పాటలు, సంగీతం అన్ని ఏర్పాటు చేశారు. ఈ పశుసంరక్షణ విధానం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
కేరళలోని కొట్టాయంలోని సీఎంఎస్ కాలేజ్లో పీజీ చదువుతున్న ఇషా, నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఆమె సోదరి దితి. అలక్కం కండి తరవాడ్ చెందిన వీరి వద్ద 11 మరగుజ్జు ఆవులు ఉన్నాయి. వారి తల్లిదండ్రుల సాయంతో వాటిని పెంచుతున్నామని ఇషా తెలిపింది. 'మా తాత కుమారన్ రైతు. అప్పట్లో ఇక్కడ ఎప్పుడూ ఆవులు ఉండేవి. కానీ ఒకసారి తాత దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆవులను అమ్మేశారు. ఆవులు లేక ఇల్లు ఖాళీగా అనిపించేది. కొవిడ్ సమయంలో ఒక ఆవును తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. కాసర్గోడ్ మరగుజ్జు ఆవును ఒకటి ఇంటికి తీసుకొచ్చాం. దానికి సుందరి అనే పేరు పెట్టుకున్నాం. అప్పటికే ఆ ఆవు గర్భవతిగా ఉంది. తర్వాత మరొక ఆవు కొన్నాం. అలా ఇప్పుడు 11 మరగుజ్జు ఆవులు ఉన్నాయి. వాటికి అన్నింటికి వివిధ పేర్లు పెట్టాం' అని ఇషా తెలిపింది.

ఆవులకు ప్రత్యేక ఆహారం
ప్రతీ ఆవుకూ ఓ ప్రత్యేక ఉంటుందని ఇషా చెబుతోంది. 'వాటి కోసం ప్రత్యేక పశువుల పాక ఉంటుంది. అవి విశ్రాంతి తీసుకోవడం కోసం సంగీతం ఉంటుంది. దోమలు, ఈగలు దూరం కావడానికి ఫ్యాన్‌లు ఉంటాయి. పాలను పితికే సమయంలో వేణువు స్వరాలు వినిపిస్తాం. మిగతా సమయాల్లో ఎఫ్‌ఎమ్ పాటలు నిరంతరం ప్లే అవుతాయి. వీటికి ఆవులు బాగా స్పందిస్తాయి. కాసరగోడ్ మరుగుజ్జు ఆవులకు సమస్యలు అంతగా ఏం ఉండవు. పిల్లలు కూడా వాటిని జాగ్రత్తగా చూసుకునే స్వభావం కలిగి ఉంటుంది. అయితే వీటిని గడ్డి, బియ్యపు తరుగు, అరటి పండుతో పాటు కొబ్బరి, వేరుశెనగ, నువ్వులను రుబ్బి పిండిలా తయారు చేసి ఆహారంగా ఇస్తాం' అని ఇషా పేర్కొంది.

ఆవు పేడకు ఫుల్ డిమాండ్
ప్రతి ఆవు రోజుకి సుమారు 2 లీటర్ల పాలు ఇస్తుందని ఇషా సోదరి దితి తెలిపింది. 'ఈ కాసర్గోడ్ మరగుజ్జు ఆవులు A2 టైప్ పాలను ఇస్తాయి. ఈ పాలను సమీపంలోని ఇళ్ల దగ్గర వాళ్లు అమ్ముతాం. మిగతా పాలను ఇంట్లో అవసరాలకు ఉపయోగిస్తాం. అయితే పాలతో అంతగా ఆదాయం లేకపోయినా, ఆవు పేడకు మంచి డిమాండ్ ఉంది. దానిని కొబ్బరి, చెరకు, కూరగాయ పంటలకు వాడతాం. అదనంగా ఉన్నది పొడి చేసి ప్యాక్ చేసి అమ్ముతారు. ఇందుకోసం చిన్న గ్రైండింగ్ యంత్రం కూడా ఇంట్లో ఉంది. ఈ ఆవుల వల్ల తమకు చదువుకు ఎలాంటి ఆటంకం లేదని దితి చెబుతోంది. ఉదంయ ఆరు గంటలకల్లా ఆవుల పనులు పూర్తవుతాయి. మా నాన్నే ఆవులను మేపే బాధ్యతను చూసుకుంటారు. ఆయనకు కృషి భవన్ నుంచి ఉత్తమ రైతు పురస్కారం కూడా లభించింది. ఇక ఇషా కూడా డిగ్రీ సమయంలోనే ఉత్తమ పశు సంరక్షణ అవార్డు కూడా గెలుచుకుంది' అని దితి చెప్పింది.

తమ ఇంటికి ఇతర కాపలదారులు అవసరం లేదని ఇషా చెబుతోంది. ఎవరైనా అపరిచితులు గేటు దాటి వస్తే వెంటనే వాటి చెవులు ఎత్తి అటువైపు చూస్తాయని చెప్పింది. వాటి ముఖం చూసి కూడా ఏదో జరుగుతోందని కచ్చితంగా తెలుస్తోందని తెలిపింది. ఈ రోజుల్లో ఆవులు, పశు విసర్జనలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వస్తాయని, వాళ్లు కూడా అలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నామని, కానీ వాటిని పట్టించుకోలేదని ఇద్దరు సోదరీమణులు చెప్పారు.

ఖర్చులు ఎక్కువైనా ఆరోగ్యమే సంపద
ఆవుల పాలు, పాల ఉత్పత్తులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని విద్యార్థుల తండ్రి రాజీవ్ కుమార్ తెలిపారు.'అయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువని . రోజుకి దాదాపు రూ.500 ఖర్చవుతుంది. దానికి నాలుగో వంతు కూడా ఆదాయం రాదు. అయినప్పటికీ కుటుంబం సంతోషంగా ఉంది. ఇంట్లో ఎవరూ అనారోగ్యానికి గురి కావడం లేదు, మందుల మీద ఖర్చయ్యే డబ్బు ఆవుల సంరక్షణకు వెళ్తోంది. కరోనా కాలంలో చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఈ ప్రయత్నం ఇప్పుడు ఆ కుటుంబ జీవన విధానంగా మారింది' అని రాజీవ్ కుమార్ తెలిపారు.
చిన్న ఏనుగు అంత సైజులో గేదె- ఏడాదికి 3,700 లీటర్ల పాలు- రైతుల ఫస్ట్ ఛాయిస్ ఇదే!
ఒడిశాలో మొట్టమొదటి ఉమెన్ మ్యూజిక్ బ్యాండ్- ఐదుగురితో 'రిధమ్ ప్రిన్సెస్' ఏర్పాటు

