Anti Waqf Law Protests : బంగాల్ లోని పలుచోట్ల వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ హింసపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనితో వీటి విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
హింసకు వ్యతిరేకంగా పిటిషన్లు
ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జరిగిన హింసపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల న్యాయవిచారణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలనే ఆదేశాలతో పాటు హింసపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
సర్దుకున్న పరిస్థితులు
హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ముర్షిదాబాద్‌లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. అయితే కొత్తగా హింసాత్మక సంఘటనలు జరగకుండా భద్రతా దళాలు గట్టి నిఘా ఉంచాయని అధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, భద్రతా బలగాలని మోహరించామని పేర్కొన్నారు. గత 48 గంటల్లో హింసాత్మక సంఘటనలు ఏవీ జరగలేదని వెల్లడించారు. ముర్షిదాబాద్‌లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని, వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారని చెప్పారు. హింసకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 210 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
"ఇళ్లు వదిలి వెళ్లిన వారిలో చాలా మంది తిరిగి వస్తున్నారు. హింసకు గురైన అన్ని ప్రాంతాల్లో జీవితం సాధారణ స్థితికి చేరుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తోంది. ప్రజలు పుకార్లను పట్టించుకోవద్దు. జిల్లా యంత్రాంగం బాధితుల జాబితాను రూపొందిస్తోంది. వారి ఆస్తులకు జరిగిన నష్టానికి పరిహారం అందిస్తాం" అని టీఎంసీ ఎమ్మెల్యే ఖలీలూర్ రెహమాన్ తెలిపారు.
పోలీసు వాహనానికి నిప్పు
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్)కు చెందిన కార్యకర్తలు దక్షిణ 24 పరగణాల జిల్లా భాంగర్‌లో సోమవారం పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. పోలీసుల వాహనాలు దగ్ధమయ్యాయి. వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా పశ్చిమ కోల్‌కతాలోని రామ్‌లీలా మైదాన్‌లో తలపెట్టిన ర్యాలీకి వెళ్తున్న సందర్భంగా పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. భాంగర్ ఎమ్మెల్యే నౌషద్ సిద్దిఖీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బసంతి హైవేపై భోజెర్‌హట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు భారీగా చేరుకున్న ఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు ప్రయత్నించగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పంటించారు.
'ముస్లింలకు టార్గెట్ గా చట్టం తేలేదు'
వక్ఫ్ చట్టంలోని సవరణలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు కాదని, గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికేనని అన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. దేశంలో బలవంతంగా, ఏకపక్షంగా ఎవరి భూమినైనా లాక్కోవడానికి ఎవరికీ అవకాశం లేకుండా చూసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని నొక్కిచెప్పారు. వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలు వక్ఫ్ బోర్డులకు అపూర్వమైన అధికారాలను ఇచ్చాయని చెప్పారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు- చెలరేగిన హింస
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్ లో ఏప్రిల్ 11,12 జరిగిన తేదీల్లో జరిగిన నిరసనల్లో హింస చెలరేగింది. ఈ క్రమంలో ముర్షిదాబాద్ జిల్లాలో ముగ్గురు మరణించారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు.
'వక్ఫ్' చట్టం అమలు ఏ రాష్ట్రాలు ఆపలేవ్! విపక్షాలకు రాజ్యాంగంపై గౌరవం లేదు : బీజేపీ