Kunal Kamra Video On Nirmala Sitharaman : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన పేరడీపై వివాదం కొనసాగుతోంది. దీనిపై విచారణలో భాగంగా పోలీసులు సమన్లు జారీ చేస్తున్న సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ కునాల్ మరో పాట పాడారు. మిస్టర్ ఇండియా సినిమాలోని హవా హవాయి పాటను పేరడీ చేసిన ఆయన, పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ అందులో ఆరోపించారు.
క్షమాపణలు చెప్పే ఛాన్సే లేదు!
మరోవైపు ఏక్‌నాథ్ శిందేపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్ కామ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. శిందే గురించి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్న మాటలనే తాను చెప్పాననన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడనంటూ ఎక్స్ వేదికగా కునాల్ స్పందించారు. అయితే, ఈ వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి ఇటీవల విచారణకు హాజరుకావాలని పోలీసులు సమన్లు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. వారం రోజుల గడువు కావాలని కునాల్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన పోలీసులు రెండోసారి సమన్లు జారీచేశారు.
ఇదిలా ఉంటే, ఇటీవల హబిటాట్ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏక్‌నాథ్ శిందేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చడంతో పాటు దిల్ తో పాగల్ హై అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడటం తీవ్ర వివాదానికి కారణమైంది. దీనిపై ఇటీవల స్పందించిన ఏక్‌నాథ్ శిందే, కామ్రా వ్యాఖ్యలు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సుపారీ తీసుకున్నట్లు ఉన్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యానికి, వ్యంగ్యానికి ఓ హద్దు ఉంటుందని పేర్కొన్నారు.