Amaravati Young Man Interesting Story : "మనసుంటే మార్గం ఉంటుంది" అంటారు పెద్దలు. మహారాష్ట్రలోని మెల్‌ఘాట్ దట్టమైన అడవులకు నెలవు. ఆ అడవుల్లోని మారుమూల గ్రామం చౌరకుండ్‌కు చెందిన యువకుడు అజయ్ రఘు ఖడ్కేకు బాంజో నేర్చుకోవాలనే కోరిక ఉండేది. అయితే ఆ అడవుల్లో అతడికి బాంజో ఎవరు మాత్రం నేర్పిస్తారు. అయినా అజయ్ నిరాశపడలేదు. ఇందుకోసం యూట్యూబ్‌నే తన గురువుగా మార్చుకున్నాడు. మెల్‌ఘాట్ అడవుల్లో గేదెలు, ఆవులను మేపుతూనే తీరిక దొరికినప్పుడల్లా యూట్యూబ్ వీడియోలు చూసి బాంజో వాయించడం నేర్చుకున్నాడు. ఇప్పుడతడు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో బాంజో వాయిస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. దృఢ సంకల్పంతో కృషి చేస్తే దేన్నైనా సాధించగలరు అని నిరూపించిన అజయ్ రఘు ఖడ్కేపై 'ETV భారత్' కథనమిది.
చేతిలో ఫోన్ ఉన్నా!
చౌరకుండ్ గ్రామంలో నివసించే అజయ్ రఘు ఖడ్కే కుటుంబానికి ఆవులు, గేదెల పెంపకంతో పాటు పాల వ్యాపారంలో ఉంది. అజయ్ తండ్రి ఈ వ్యాపారాన్ని చేస్తూనే ఊరిలో జరిగే భజన కార్యక్రమాల్లో హార్మోనియం వాయించేవారు. తన తండ్రిని చూసి అజయ్ కూడా ఇంట్లో ఉన్న హార్మోనియం వాయించడానికి ప్రయత్నించేవాడు. తండ్రి ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చిన తర్వాత అజయ్ యూట్యూబ్ చూసి హార్మోనియం వాయించే మెళకువలను నేర్చుకున్నాడు. ఈక్రమంలోనే అతడికి బాంజో వాయించే వీడియోలు కనిపించాయి. దీంతో వాటిపైనా ఆసక్తి పెరిగింది. అయితే అజయ్ ఎదుట కొన్ని సవాళ్లు నిలిచాయి. చౌరకుండ్ గ్రామంలో ఇంటర్నెట్ సేవలకు, సెల్ ఫోన్ సిగ్నల్స్‌కు తరచూ అంతరాయం కలిగేది. గ్రామ పంచాయతీ కార్యాలయం, అటవీ రేంజ్ ఆఫీసర్ కార్యాలయంలో మాత్రమే వైఫై సౌకర్యాలు ఉండేవి. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని వైఫైని వాడుకొని బాంజో, హార్మోనియం వాయించడంలో ట్రైనింగ్ ఇచ్చే వీడియోలను యూట్యూబ్ నుంచి అజయ్ డౌన్‌లోడ్ చేసుకునేవాడు. వాటిని చూసి తొలుత హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు.

సెకండ్ హ్యాండ్ బాంజో కొని!
ఆ తర్వాత సమీప బంధువుల దగ్గర ఒక సెకండ్ హ్యాండ్ బాంజోను అజయ్ కొన్నాడు. అతడు గేదెలను మేపడానికి అడవికి వెళ్లేటప్పుడు బాంజోను కూడా తీసుకెళ్లేవాడు. అడవిలో ఏదో ఒక చెట్టు కింద కూర్చొని యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ చేసిన వీడియోలను చూస్తూ బాంజోలోని ఏ బటన్‌పై నొక్కితే ఎలాంటి స్వరం వస్తుందో తెలుసుకోసాగాడు. దాని ఆధారంగా రోజూ బాంజో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు పగటిపూట అడవిలో వీడియోలను చూసి రాత్రి టైంలో ఇంటి వద్ద బాంజోపై ప్రాక్టీస్ చేసేవాడు. ఈవిధంగా కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లోనే బాంజోను వాయించడంపై అజయ్ పట్టు సాధించాడు.

ఇరుగుపొరుగు గ్రామాల నుంచి పిలుపు
"తొలుత మా చౌరకుండ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో బాంజో వాయించడం ప్రారంభించాను. ఆ తర్వాత భజన కార్యక్రమాల్లో బాంజో వాయించడం ప్రారంభించాను. గ్రామంలో గణపతి, దేవీ నవరాత్రి ఉత్సవాలలో బాంజో వాయించాను. అనంతరం ప్రజలు నన్ను అభినందించడం ప్రారంభించారు. చౌరకుండ్ నుంచి కొంత దూరంలో ఉన్న పాట్య, చకర్దా వంటి గ్రామాల నుంచి కార్యక్రమాలకు నాకు ఆహ్వానాలు అందసాగాయి. ఒక్కో కార్యక్రమంలో బాంజో వాయించినందుకు నాకు రూ.500 నుంచి రూ.1000 దాకా ఇస్తున్నారు" అని ఈటీవీ భారత్‌కు అజయ్ వివరించాడు.