JK Govt Advisory : భారత్, పాక్ ఉద్రిక్తతల తర్వాత సైబర్ ముప్పు పెరిగిన నేపధ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సర్కార్ పరిధిలోని డిజిటల్ డేటా, కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, వాటి భద్రతను పెంచడానికి అవసరమైన మార్గదర్శకాలతో సర్క్యులర్‌ను జారీ చేసింది. జమ్ముకశ్మీర్ పరిధిలోని పరిపాలనా విభాగాలు, అధికారులు నిర్దిష్ట సైబర్ భద్రతా ప్రమాణాలను పాటించాలని నిర్దేశించింది. అనధికారిక డిజిటల్ వేదికల వినియోగాన్ని ఆపేయాలని ఆదేశించింది. ఈమేరకు వివరాలతో సర్క్యులర్‌ను జమ్మూకశ్మీర్ సర్కారు విడుదల చేసింది.
డాట్ కామ్, డాట్ నెట్ వెబ్‌సైట్ల నిలిపివేత
ప్రభుత్వ శాఖలు/ విభాగాలు ".com", ".org", ".net" వంటి డొమైన్‌లతో వినియోగిస్తున్న వెబ్‌సైట్లను వెంటనే నిలిపివేయాలని జమ్ముకశ్మీర్ సర్కారు ఆదేశించింది. తప్పకుండా అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు ".gov.in", ".jk.gov.in" వంటి ప్రభుత్వ డొమైన్‌లలో మాత్రమే హోస్ట్ చేయాలని నిర్దేశించింది. భవిష్యత్తులో ప్రభుత్వ విభాగాల కొత్త వెబ్‌సైట్‌ల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)ను మాత్రమే సంప్రదించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సూచించింది.
కేంద్ర ఐటీశాఖ ఆమోదం పొందిన తర్వాతే కొత్త వెబ్‌సైట్లను వాడాలని తేల్చి చెప్పింది. అన్ని రకాల ప్రభుత్వ కమ్యూనికేషన్‌ల కోసం అధికారిక ఎన్ఐసీ ఈమెయిల్ ఐడీలను ప్రత్యేకంగా ఉపయోగించాలని జమ్మూ కశ్మీర్ సర్కారు తెలిపింది. ‘జీమెయిల్, యాహూ, రెడిఫ్ మెయిల్ వంటి వాటి నుంచి వచ్చే ఈమెయిల్స్‌ను అనధికారికమైనవిగా పరిగణించాలని, వాటికి స్పందించకూడదని కోరింది. పైరేటెడ్ లేదా పాత సాఫ్ట్‌వేర్‌లను బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఐటీ ఆడిట్‌కు ఆదేశాలు
అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు (CISO), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు (ISOలు) సమగ్ర ఐటీ మౌలిక సదుపాయాల ఆడిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా హార్డ్‌వేర్ / సాఫ్ట్‌వేర్లు, లైసెన్స్ పొందిన వ్యవస్థల ధృవీకరణ, ఫైర్‌వాల్/యాంటీవైరస్ స్థితిగతులు, నెట్‌వర్క్ సెక్యూరిటీ కన్ఫిగరేషన్లను తనిఖీ చేయాలని సూచించింది. జమ్మూకశ్మీరులోని వివిధ విభాగాలలో ఉన్న ఐటీ అధికారులకు సైబర్ హైజీన్, బెదిరింపుల ప్రతిస్పందనపై శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐసీని సర్కారు కోరింది.
ఆన్‌లైన్ సేవలు, యాప్‌లలో అంతరాయాలు
ఆపరేషన్ సిందూర్ వేళ భారతదేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల సైబర్ దాడులు జరిగాయని మహారాష్ట్ర సైబర్ సెల్ తెలిపింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ ప్రజలు అనేక ఆన్‌లైన్ సేవలు, యాప్‌లలో అంతరాయాలను చవిచూస్తున్నారు. దీనివల్ల బిల్లుల చెల్లింపులు వంటి వ్యవహారాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. జమ్మూకశ్మీరు ప్రభుత్వ ఈ-ఆఫీస్ కూడా పాక్షికంగానే పనిచేస్తోంది. బిల్లింగ్ అప్లికేషన్లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. సైబర్ ముప్పు కారణంగా తీసుకున్న నివారణ చర్యలే డిజిటల్ అంతరాయానికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. హ్యాకర్లకు చిక్కకుండా డిజిటల్ డేటా రికార్డులను సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వ ఐటీ గవర్నెన్స్ ప్రొటోకాల్‌లను ప్రస్తుతం అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు.