Ambedkar Jayanti 2025 : ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను క్లుప్తంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
జననం
డా.బీఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు.
అడుగడుగునా వివక్ష
దళిత వర్గానికి చెందిన అంబేడ్కర్ ఆ రోజుల్లో ఉన్న అంటరానితనమనే దురాచారం కారణంగా సమాజంలో ఎన్నో అవమానాలు, వివక్షను ఎదుర్కొన్నాడు. బడికి వెళ్లినా, గుడికి వెళ్లినా అందరితో కలిసి కూర్చోడానికి అనుమతి ఉండేది కాదు.
అనుభవాలే పాఠాలుగా!
అంబేడ్కర్ చిన్న వయసులో తాను ఎదురుకొన్న చేదు అనుభవాలను పాఠాలుగా మార్చుకున్నారు. జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సమాజంలో మార్పు తేవాలన్నా చదువుతోనే సాధ్యమని గ్రహించాడు.
ఉన్నత విద్య
పట్టుదలతో చదివి ప్రపంచంలో అగ్రస్థాయి విద్యాసంస్థల నుంచి డిగ్రీలు పొందారు. అంబేడ్కర్‌కు 64 సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ ఉంది. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్ఏ, పీహెచ్‌డీ పట్టా పొందారు. వీటితో పాటు దాదాపు 21 ఏళ్ల పాటు ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో 8 ఏళ్ల కోర్సును కేవలం 2 ఏళ్ల 3 నెలల్లో పూర్తి చేశారు. ఇందుకోసం ఆయన రోజుకు 21 గంటలు చదువుకునేవారు.
బహుభాషా కోవిదుడు
అంబేడ్కర్‌కు హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి భాషల్లో ప్రావీణ్యం ఉంది.
అణగారిన వర్గాల ప్రతినిధిగా సమాజ సేవ
అంబేడ్కర్ జీవితమంతా సమాజంలో వివక్షను ఎదుర్కొన్న వారికి న్యాయం అందించడమే లక్ష్యంగా కొనసాగింది. ఆయన జీవన పోరాటం నుంచి మచ్చుకు కొన్ని
- అణగారిన వర్గాల విద్యా హక్కుల కోసం పోరాటం
- దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు
- మహాడ్ సత్యాగ్రహం, కాలారం దేవాలయ ప్రవేశ ఉద్యమం లాంటి చారిత్రక ఉద్యమాలు
- విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ వ్యవస్థకు బలమైన పునాది
రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్
1947లో భారత స్వాతంత్రం తరువాత అంబేడ్కర్‌ను భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా నియమించారు.
- ఆయన ఆధ్వర్యంలో తయారైన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందింది.
- అందులో సమానత్వం, స్వేచ్ఛ, బంధుత్వం, హక్కులు వంటి అంశాలకు కేంద్రస్థానంగా ఇచ్చారు.
- అన్ని వర్గాలకు, జాతులకు, మతాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు.
బౌద్ధమతం స్వీకారం
సమాజంలో శాంతి సమానత్వం సాధించడానికి అంబేద్కర్ 1956లో నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధమతం స్వీకరించారు.
ఈ తరం బుద్ధుడు
బౌద్ధ సన్యాసి మహంత్ వీర్ చంద్రమణి బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను 'ఈ తరం బుద్ధుడు' అని పిలిచేవారు.
స్ఫూర్తి ప్రదాత
డాక్టర్ అంబేడ్కర్ జీవితమే ఓ స్ఫూర్తి. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చునని సమాజానికి తెలిపాడు. విద్యే అసలైన శక్తి అని, సమాజంలో దురాచారాలు పోవాలంటే హక్కులు అడగడం కాదు సాధించుకోవాలని సమాజానికి చాటి చెప్పిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్! చివరగా అంబేడ్కర్ జయంతి కేవలం ఒక జయంతి కాదు – సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాభిమానానికి నాంది పలికిన ఓ ఉద్యమ యోధుడికి అర్పించే ఘన నివాళి.