Justice Yashwant Varma News : దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించాక తుది ప్రకటన వెలువడనుంది. అయితే సుప్రీం కోర్ట్ కొలీజియం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అలహాబాద్ కోర్ట్ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి, సీబీఐ, ఈడీ దర్యాప్తునకు అనుమతించాలని సీజేఐను కోరింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. దీనితో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్లు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్‌వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఇది వరకే పేర్కొంది. అయితే ఆ నిర్ణయంపై కొలిజియంలోని కొందరు సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే, ఈ రోజు దిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ కీలక ప్రకటన చేసింది. ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అది అమల్లో ఉంటుందని తెలిపింది. కానీ ఇంతలోనే కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఆరోపణలు ఖండిస్తున్నా!
జస్టిస్ వర్మ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దిల్లీ హైకోర్టు సీజేకు ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. తాను గానీ, తన బంధువులు గానీ ఎటువంటి డబ్బు కట్టలను గదిలో ఉంచలేదని తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు. తమ నగదు ఉపసంహరణలు బ్యాంకుల ద్వారానే జరుగుతాయని, తాము యూపీఐ యాప్‌లను వాడతామని, కార్డులతో లావాదేవీలు జరుపుతామని వివరించారు. తాము ఆ గదిని సాధారణంగా ఉపయోగంలో లేని ఫర్నిచర్, సీసాలు, క్రాకరీ, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, గార్డెన్ వస్తువులను ఉంచడానికి వాడతామని తెలిపారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు తోసిపుచ్చారు. మూడు తరాలుగా ఆయన కుటుంబం గురించి తనకు తెలుసని పేర్కొన్నారు.
అభిశంసన
జస్టిస్ వర్మ వ్యవహారంలో న్యాయపరమైన దర్యాప్తు జరగాలని, ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సంఘటనతో ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతిందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని పార్లమెంట్‌లో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అభిశంసించాలని సీపీఐ ఎంపీ పి. సందోశ్ కుమార్ డిమాండ్ చేశారు.