Population Suffering From Diabetes : షుగర్ (డయాబెటిస్) వ్యాధి పెనుగండంగా మారింది. ఏటా ఎంతోమంది దీని బారినపడుతున్నారు. దీనికి సంబంధించిన షాకింగ్ గణాంకాలు తాజాగా బయటికి వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో దాదాపు 45 లక్షల జనాభా ఉంది. కలవరపరిచే విషయం ఏమిటంటే, వీరిలో దాదాపు 16 లక్షల మంది మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి బారినపడిన వారిలో అత్యధికంగా 70 శాతం మంది జిల్లా కేంద్రం (అలీగఢ్ నగరం), పట్టణాలకు చెందిన వారేనట. మిగతా 30 శాతం మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈమేరకు వివరాలతో విడుదలైన అధ్యయన నివేదికను పరిశీలిద్దాం.
400 మంది సర్వే
అలీగఢ్ జిల్లాలో షుగర్ (డయాబెటిస్) వ్యాధిగ్రస్తుల సంఖ్య భారీగా పెరిగిపోయిన తీరుకు ఈ గణాంకాలే నిదర్శనం. ఆందోళన కలిగించేలా ఉన్న ఈ సమాచారంతో జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి చెందిన రాజీవ్ గాంధీ డయాబెటిస్ సెంటర్ అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ అధ్యయనంలో భాగంగా అలీగఢ్ జిల్లా పరిధిలోని జిల్లా కేంద్రం(అలీగఢ్ నగరం), పట్టణాలు, గ్రామాలకు చెందిన 18 నుంచి 60 ఏళ్లలోపు 400 మందిని సర్వే చేశారు. దాదాపు 8 నెలల పాటు ఈ సర్వే కొనసాగింది. ఈ అధ్యయన బృందానికి రాజీవ్ గాంధీ డయాబెటిస్ సెంటర్ ప్రొఫెసర్ హమీద్ అష్రఫ్ సారథ్యం వహించారు.
అధ్యయనం జరిగింది ఇలా!
ప్రొఫెసర్ హమీద్ అష్రఫ్ సారథ్యంలోని టీమ్ 2024 సెప్టెంబరులో ఈ అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రత్‌గావ్, జవాన్, చెరాత్ సహా ఎనిమిది గ్రామాలను సందర్శించారు. అలీగఢ్ సిటీ పరిధిలోని ఉపర్‌కోట్, సర్ సయ్యద్ నగర్, ధౌర్మఫీ, జమాల్‌పుర్ సహా పలు ప్రాంతాల ప్రజలను సర్వే చేశారు. ఈ సర్వేలో పాల్గొన్న వారికి అన్నం తినకముందు ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షను నిర్వహించారు. దీనితో పాటు ర్యాండమ్ ప్లాస్మా గ్లూకోజ్ టెస్ట్, ఏ-1సీ టెస్ట్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించారు.
ఏ-1సీ టెస్ట్ అనేది ఒక రక్త పరీక్ష. ఇది గత రెండు, మూడు నెలల బ్లడ్ షుగర్ లెవల్స్ సగటును తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సర్వేలో పాల్గొన్న వారికి ఈ టెస్టులన్నీ చేశాక, దాదాపు ఎనిమిది నెలల పాటు వారి రోజువారీ జీవన శైలులను నిశితంగా పరిశీలించారు. చివరగా తేలింది ఏమిటంటే.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 14 శాతం మందికి డయాబెటిస్, 13 శాతం మందికి ప్రీ - డయాబెటిస్ ఉంది. గ్రామాల్లో కంటే నగరాలు, పట్టణాల్లోనే షుగర్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. అలీగఢ్ జిల్లాలోని ప్రతీ మూడో వ్యక్తి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు.
అవిసె గింజలు రోజూ తింటే 'డయాబెటిస్' తగ్గుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే!
టైప్ వన్ మధుమేహ బాధితులకు గుడ్‌న్యూస్ - ప్రభుత్వమే ఉచితంగా మందులు అందిస్తుంది