ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం మాకు లేదు- పాక్ అలా చేస్తే మాత్రం ఊరుకోం: అజిత్ ఢోబాల్
అమెరికా సహా పలు దేశాల ఎన్ఎస్ఏలతో మాట్లాడిన అజిత్ ఢోబాల్- దాడుల వివరాలు వెల్లడి

Published : May 7, 2025 at 7:16 PM IST
Ajit Doval Speaks With Rubio : 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన దాడులు గురించి భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా, చైనా, యూకే, యూఏఈ సహా పలు దేశాల ఎన్ఎస్ఏలకు వివరించారు. ఉగ్రవాద స్థావరాల మౌళిక సదుపాయాలపై మెరుపు దాడులు జరిపిన వెంటనే ఆయా దేశాల ఎస్ఎస్ఏలతో మాట్లాడి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
'ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్‌కు లేదు'
అమెరికా ఎన్ఎస్ఏ, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, జపాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో ఢోబాల్ మాట్లాడారు. ఈ క్రమంలో ఉగ్రస్థావరాలపై దాడులు, అమలు విధానం గురించి వారికి వివరించారు. అయితే, ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం మాత్రం తమకు లేదని తెలిపారు. పరిస్థితులను తీవ్రతరం చేసేలా పాక్ వ్యవహరిస్తే భారత్ నుంచి ప్రతిస్పందన మరింత గట్టిగా ఉంటుందని వెల్లడించారు.
దాడులపై మాట్లాడిన రుబియో
అటు భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారులతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మంగళవారం మాట్లాడారు. ఇరు దేశాలు కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచాలని, ఉద్రిక్తతలను నివారించాలని సూచించారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కీలక విషయాలు వెల్లడించిన మిస్త్రీ
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత అనాగరికతతో కూడుకున్నదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. బాధితులలో ఎక్కువ మందిని తమ కుటుంబ సభ్యుల ముందే తలపై కాల్చి చంపారని స్పష్టం చేశారు. ముష్కరులు కశ్మీర్లో సాధారణ స్థితిని దెబ్బతీసే లక్ష్యంతో ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. అందుకే సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మంగళవారం అర్ధరాత్రి పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపిందని పేర్కొన్నారు. ఉగ్రవాదుల మౌళిక సదుపాయాలను కూల్చివేయడంపైనే భారత బలగాలు దృష్టి సారించాయని వెల్లడించారు.
రివేంజ్ అటాక్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది భారత్. పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బలగాలు క్షిపణులు ప్రయోగించాయి. అయితే ఈ దాడుల్లో బవహల్పూర్(జైషే మహ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం.
లంకా దహనం చేసిన హనుమంతుడే మాకు ఆదర్శం: రాజ్‌నాథ్ సింగ్
దేశవ్యాప్తంగా 'హై అలర్ట్'- ఆ రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా ఎమర్జెన్సీ మీటింగ్!

