Air India Additional Compensation : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా, అందులో ప్రయాణించిన మిగతావారంతా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ఎయిరిండియా, వారి తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు గాను అదనంగా రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. టాటా గ్రూపు ప్రకటించిన రూ.కోటి పరిహారానికి ఇది అదనమని స్పష్టం చేసింది.
"ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఎయిరిండియా సంఘీభావం తెలుపుతోంది. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో మా బృందాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు వీలుగా రూ.25లక్షల చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం. ఇప్పటికే టాటా గ్రూప్ ప్రకటించిన రూ.1 కోటి పరిహారానికి ఇది అదనం"
- ఎయిరిండియా ప్రకటన
బాధితులకు అండగా- టాటా గ్రూప్!
అంతకుముందు ఈ విమాన ప్రమాదంపై టాటా గ్రూపు ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ, 'ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ అండగా ఉంటుంది. సంస్థ తరఫున రూ.1 కోటి అందజేయడంతోపాటు, గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా భరిస్తుంది' అని అన్నారు.
Message from Campbell Wilson, CEO & MD, Air India. pic.twitter.com/o1wQnReCaG
— Air India (@airindia) June 14, 2025
ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ విమానంలో మొత్తం 242 మంది ఉండగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 241 మంది చనిపోయారు. వీరితోపాటు మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలడంతో, అక్కడ ఉన్న కొందరు వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఇప్పటి వరకు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 270కు చేరుకుంది. మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు ఈ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను గుర్తించి, దానిని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది.