Ahmedabad Flight Crash Fatalities : ఒక్క ప్రయాణం, వందలాది మంది ప్రయాణికులు, అందరి గమ్యస్థానం ఒక్కటే. ప్రతీ ప్రయాణం వెనక ఎన్నో కలలు, ఎన్నెన్నో ఆశలు, మరెన్నో ఆశయాలు, మరికొన్ని బాధ్యతలు. అన్నీ కన్నుమూసి తెరిచేలోపే మంటల్లో మసైపోయాయి. భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న నవవధువు, లండన్‌లో కుటుంబంతో కలిసి జీవించాలనుకున్న వైద్యుడు, పర్యటన కోసం వెళ్తున్న తోబుట్టువులు, ఇలా ఒకరా ఇద్దరా వందలాది జీవితాలు ఆ ప్రయాణంలోనే ముగిసిపోయాయి. తమ గమ్యం లండన్ కాదు మృత్యువని చివరి నిమిషంలోనూ గ్రహించే సమయం కూడా వారికి లేకపోయింది. తమవారికి చివరి చూపు దక్కకుండా బూడిదైపోయిన ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కాలం రాసిన ఆ విషాదాంతంలో ప్రతీ కథా మనకు కంటతడి పెట్టిస్తున్నదే!
తీరిన ఆశయం- పోయిన ప్రాణం
తన కల నేరవేరిందని సంతోషపడే లోపే మృత్యువు కబళించిందీ ఆ యువతికి. నవీ ముంబయికి చెందిన మైథిలి పాటిల్ ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలో క్రూ మెంబర్‌గా ఉన్నారు. తన ఉద్యోగం పట్ల ఆనందపడే లోపే ఆమె మరణించారు. దీంతో మైథిలి కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

నవీ ముంబయిలోని నవా గ్రామానికి చెందిన మైథిలి పాటిల్ (22)కి చిన్నప్పటి నుంచి ఎయిర్ బ్యూటీ క్వీన్ కావాలని కల. ఆ కల నిజమైంది కానీ విమాన ప్రమాదంతో ఆమె జీవితమే ముగిసింది. విమాన ప్రమాదంలో మరణంచిన ఎయిరిండియా సిబ్బందిలో ఆమె ఒకరు. బుధవారం మధ్యాహ్నం మైథిలి విధుల కోసం బయలుదేరిందని ఆమె బంధువు జితేంద్ర మాత్రే వాపోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేకపోయిన విమానయాన విద్యను పూర్తి చేసి ఎయిర్ ఇండియాలో ఎయిర్ బ్యూటీ క్వీన్ గా చేరిందని చెప్పారు.
కొడుకును కలుద్దామని వెళ్లి!
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును కలిసేందుకు లండన్ బయలుదేరిన ఓ జంట విమాన ప్రమాదంలో ప్రాణాలు వదలడం అందర్నీ కలిచివేసింది. కొడుకును చూడకుండా మృత్యుఒడిలోకి వెళ్లిపోయారని బంధువులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లాలోని సంగోలా తాలూకాకు చెందిన మహాదేవ్ తుకారాం పవార్, ఆశా మహాదేవ్ గుజరాత్ లో నివసిస్తున్నారు. వీరు రిటైర్డ్ ఉద్యోగులు. తమ కుమారుడిని చూసేందుకు లండన్ బయలుదేరి విమాన ప్రమాదంలో ఇద్దరూ దంపతులు మరణించారు.

ఫ్యామిలీతో లండన్‌లో సెటిల్ అవుతుదామనుకుంటే అనంతలోకాలకు!
రాజస్థాన్‌కు చెందిన ఓ వైద్యుడు తన ఫ్యామిలీతో కలిసి లండన్‌లో స్థిరపడిపోవాలనుకున్నారు. ఈ క్రమంలో విమాన ప్రయాణ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునేందుకు ఫ్లైట్ గాల్లోకి ఎగరగానే కుటుంబంతో కలిసి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకున్నారు. అంతలోనే వారి కలలు అడియాశలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై వారంతా లోకాన్ని వీడారు.

రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషీకి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఉదయ్ పుర్లోని ఓ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. జోషి ఇటీవలే లండన్ వెళ్లి తన కుటుంబాన్ని కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు రెండ్రోజుల క్రితమే భారత్ కు వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబమంతా కలిసి లండన్‌కు బయలుదేరగా, విమాన ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. దీంతో కుటుంబ సభ్యులంతా విమాన ప్రమాదం మృత్యుఒడిలోకి చేరారు.
కొడుకును కలవడానికి బయలుదేరిన దంపతులు
లండన్‌లో ఉన్న తమ కొడుకును కలవడానకి బయలుదేరిన తల్లీదండ్రులు విమాన ప్రమాదంలో మరణించారు. తమ బిడ్డను చూడకుండానే మృత్యుఒడికి చేరుకున్నారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన మేశ్ భాయ్ థక్కర్, అతని భార్య లాబుబెన్ థక్కర్ తమ కొడుకును చూడడానికి ఎయిరిండియా విమానంలో గురువారం బయలుదేరారు. అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ లో దంపతులిద్దరూ మరణించారు.

భర్తను మొదటిసారి కలిసేందుకు!
వివాహం తర్వాత లండన్ లో ఉన్న తన భర్తను మొదటిసారి కలవడానికి బయలుదేరింది ఓ యువతి. అయితే ఆమెను భర్త వద్దకు చేరనివ్వలేదు విమాన ప్రమాదం. కాళ్లకు ఉన్న పారాణి కూడా ఆరకుండానే పైలోకానికి వెళ్లిందీ ఈ మహిళ.

రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలోని ఖుష్బు కన్వర్ ఈ ఏడాది జనవరి 18న లండన్‌లో పనిచేస్తున్న వైద్యుడు విపుల్ సింగ్ రాజ్ పురోహిత్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఖుష్బు తన అత్తమామల ఇంట్లో నివసిస్తోంది. వీసా సంబంధిత పత్రాలు పూర్తైన తర్వాత మొదటిసారిగా తన భర్తను కలవడానికి లండన్ బయలుదేరింది. తన తండ్రి మదన్ సింగ్, కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వెళ్లింది. అయితే గురువారం జరిగిన విమాన ప్రమాదంలో భర్తను కలవకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుందామని!
యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య 50 వ పుట్టినరోజును లండన్‌లో జరుపుకోవాలని ప్లాన్ చేశాడు. తన భార్యను తీసుకుని లండన్ టూర్‌కు బయలుదేరాడు. అయితే గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంలో భార్యతో సహా ప్రాణాలు వదిలాడు. బర్త్ డే వేడుకల చేసుకుందామని వెళ్తే ఆఖరికి ప్రాణాలే పోయాయి.

సొంతింటి కల తీరకుండానే!
కేరళకు చెందిన రంజిత అనే నర్సు సొంతింటి నిర్మాణం కోసం విదేశాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ నర్సుగా ఉన్న ఆమె కొన్నాళ్ల సెలవు పెట్టి లండన్‌కు ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే సెలవులకు సంబంధించిన పేపర్ల కోసం కేరళ వచ్చిన ఆమె మళ్లీ లండన్‌కు బయలుదేరారు. అంతలోనే విమాన ప్రమాదంలో మరణించారు.

ఆఖరి కాల్ చేసిన నో రిప్లై!
హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన ఓ మహిళ తన కూతుర్ని కలుద్దామనుకుని బయలుదేరి విమాన ప్రమాదంలో మరణించింది. కుటుంబ సభ్యులకు విమానం ఎక్కిన తర్వాత గ్రూప్ వీడియో కాల్ చేసిన ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో తమ సోదరి ఆఖరి కాల్‌ను లిఫ్ట్ చేయలేకపోయామని మృతురాలు అంజు శర్మ సోదరి వాపోయారు.

తల్లి చూడడానికి వచ్చి మృత్యుఒడిలోకి!
భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్ పౌరుడు ముంబయిలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూడడానికి కుటుంబంతో కలిసి వచ్చాడు. అయితే తిరుగు ప్రయాణంలో తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా అతడు మృత్యుఒడికి చేరుకున్నాడు. తన తల్లిని చివరిసారిగా చూసి అనంతలోకాలకు వెళ్లిపోయాడు జావేద్ ఆలీ.

ఎలా బతికానో నాకే తెలియట్లేదు- మొత్తం కళ్ల ముందే జరిగింది: 'మృత్యుంజయుడు' విశ్వాస్
విమాన ప్రమాదం జరిగి పొలిటీషియన్ మరణిస్తారు- 2రోజుల ముందే చెప్పిన వ్యక్తి