Ahmedabad Flight Crash Death Toll : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదంలో 275 మంది చనిపోయారు. అందులో 241 మంది ప్రయాణికులు ఉండగా, 34 మంది స్థానికులు ఉన్నారు. ఈ మేరకు గుజరాత్ అధికారులు తాజాగా వెల్లిడించారు. ప్రమాద ఘటనలో ప్రాణనష్టానికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ తొలిసారి అధికారికంగా వివరాలను ప్రకటించింది.
అయితే ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్న వారు, ఇప్పటివరకు 260 మందిని గుర్తించారు. మరో ఆరుగురిని మాత్రం ముఖాలతో నిర్ధరించారు. చనిపోయిన వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 256 మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించగా, మిగతావారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తాజాగా అధికారులు తెలిపారు.
మరోవైపు, మరోవైపు ప్రమాదానికి గురైన విమానంలోని అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించేందుకు విదేశాలకు పంపించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని తెలిపారు. అది భారత్‌లోనే ఉందన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా, 11ఏ సీటులో ఉన్న ఒక్క విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడగా మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య విద్యార్థుల వసతి భవనంపై విమానం పడటంతో అక్కడున్న పలువురు వైద్యులు సహా స్థానికులు మృతి చెందారు.