Covid Cases In India : దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. గత 48 గంటల్లోనే 769 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆరోగ్య శాఖ విడదల చేసిన తాజా డేటా ప్రకారం, కేరళలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్, బంగాల్, దిల్లీలో కేసులు ఎక్కవగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 6,133లకు చేరింది. గత 24 గంటల్లోనే కొవిడ్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 1950, గుజరాత్ 822, బంగాల్ 693, దిల్లీ 686, మహారాష్ట్ర 595 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 81, తెలంగాణలో 10 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాల తనిఖీ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అంచనా వేసేందుకు జూన్ 2,3 తేదీల్లో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతా శర్మ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చర్యలను తీసుకుంటున్నమని డైరెక్టర్ జనరల్ ఆప్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీత శర్మ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ సెల్, అత్యవసర నిర్వహణ ప్రతిస్పందన (EMR) సెల్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), దిల్లోలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చర్యలను తీసుకుంటున్నమని వారు పేర్కొన్నారు.
దేశంలో మరో రెండు కొత్త కొవిడ్ వేరియంట్లు- అంతా అలర్ట్ మోడ్- నిపుణులు ఏం చెబుతున్నారు?