Congress Vs BJP On All Party Delegations : పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న పేర్లపై ఇప్పుడు రాజకీయ రగడ రాజుకుంది. తాము సిఫార్సు చేసిన నలుగురు ఎంపీలకు అఖిలపక్ష బృందంలో చోటు దక్కలేదని కాంగ్రెస్ వాదిస్తుండగా, పేర్లను సిఫార్సు చేసే ఛాన్స్ ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు తేల్చి చెబుతున్నారు. దేశానికి సంబంధించిన దౌత్య వ్యవహారాలతో ముడిపడిన అఖిలపక్ష బృందాలకు సమర్ధులైన నేతలను అన్ని పార్టీల నుంచి ప్రభుత్వమే ఎంపిక చేస్తుందని రిజిజు స్పష్టం చేశారు.
రిజిజు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇంఛార్జి) జైరాం రమేశ్ సోమవారం మండిపడ్డారు. "మే 16న ఉదయం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో కిరెణ్ రిజిజు మాట్లాడారు. అఖిలపక్ష బృందంలోకి కాంగ్రెస్ ఎంపీల ఎంపికపై చర్చించారు. ఆ తర్వాత ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ల పేర్లతో కాంగ్రెస్ పార్టీ సిఫార్సు లేఖను కేంద్ర మంత్రి రిజిజుకు పంపింది. అయితే విపక్ష ఎంపీల ఎంపిక విషయంలో ప్రధాని మోదీ చౌకబారు రాజకీయం చేశారు. అందుకే మా పార్టీ సిఫార్సు చేసిన ఎంపీల్లో ఒకరికి (ఆనంద్ శర్మ) మాత్రమే అఖిలపక్ష బృందంలో చోటుదక్కింది" అని జైరాం రమేశ్ వివరించారు. కాంగ్రెస్ సిఫార్సు చేయకున్నా, ఆ పార్టీ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీ, అమర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్‌లను అఖిలపక్ష బృందంలో చేర్చారు. ఇప్పుడు ఈ అంశంపైనే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఖర్గే, రాహుల్‌లకు మోదీ ఫోన్ చేయొచ్చుగా!
"ఎంపీల ఎంపిక విషయంలో ఖర్గే, రాహుల్ గాంధీలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేది కదా. వాళ్లకు అంత మాత్రం ఆలోచన ఎందుకు రాదు ? ఈ అంశంపైనా విభజించి పాలించు రాజకీయం చేయాలని అనుకున్నారు. అదే చేశారు"’ అని జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. "ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలే కాంగ్రెస్‌కు ముఖ్యం. ఏక్ దేశ్, ఏక్ సందేశ్ అనే భావనతో ఉగ్రవాదంపై మనం పోరాడాలి. అయితే అధికార బీజేపీ విభజించి పాలించు రాజకీయ సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది" అని ఆయన ఆరోపించారు. "ఆస్ట్రేలియా, అమెరికా, ఖతర్, దక్షిణ కొరియా, చైనా లాంటి దేశాల్లో బహిరంగంగా కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పుడు అఖిలపక్ష బృందం కోసం అదే పార్టీ సాయాన్ని మోదీ తీసుకుంటున్నారు" అని జైరాం రమేశ్ విమర్శించారు.
కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మాకు అక్కర్లేదు : కేంద్ర మంత్రి రిజిజు
కాంగ్రెస్ వాదనను కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఖండించారు. గౌరవార్ధంగానే తాను ఖర్గే, రాహుల్ గాంధీలతో మాట్లాడినట్లు వెల్లడించారు. అఖిలపక్ష బృందాల ఏర్పాటుపై వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున సమాచారం ఇచ్చానన్నారు. "కాంగ్రెస్ ఎంపీలకు అఖిలపక్ష బృందాలలో చోటు కల్పించాం. అయినా కొందరు ఎంపీలకు అవకాశం ఇవ్వనందుకు హస్తం పార్టీ చౌకబారు రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీలకు విదేశాంగ వ్యవహారాలపై మంచి అవగాహన ఉంది. అందుకే వారిని ఎంపిక చేశాం. ఇలాంటి సమర్ధుల పేర్లను కాంగ్రెస్ సూచించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్‌లకు కూడా అఖిలపక్ష బృందాలలో స్థానం ఇచ్చాం. వాళ్ల గురించి కాంగ్రెస్ ఏమంటుంది?" అని కిరెణ్ రిజిజు ప్రశ్నించారు. "కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, ఆ పార్టీ పెద్దల ఈర్ష్య, అసూయ, అభద్రతల గురించి మాకు అవసరం లేదు. విదేశీ పర్యటనకు వెళ్లే అఖిలపక్ష బృందాలు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. వాటిలో సమర్ధులకే మేం చోటు ఇవ్వగలం. అలాంటి వాళ్లనే అన్ని పార్టీల నుంచి ఎంపిక చేశాం. ఈ అంశంలో ఎవరి సిఫార్సులూ పనిచేయవు" అని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.
మేం చెప్పే వాళ్లకే అఖిలపక్ష బృందంలో చోటివ్వాలి : మమతా బెనర్జీ
విదేశీ పర్యటనకు వెళ్లే అఖిలపక్ష బృందాలను తమ పార్టీ బహిష్కరించడం లేదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్ సీఎం) వెల్లడించారు. విదేశాంగ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అయితే అఖిలపక్ష బృందాలకు ఎంపీల ఎంపిక అంశాన్ని ఆయా పార్టీలకు వదిలేయాలని ఆమె సూచించారు. ఇప్పటివరకైతే ఈ అంశంపై కేంద్ర సర్కారు తమను సంప్రదించలేదని మమత తెలిపారు. కేంద్రం సంప్రదించగానే పార్టీ ఎంపీలను తప్పకుండా విదేశీ పర్యటనకు పంపుతామని స్పష్టం చేశారు. టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను అఖిలపక్ష బృందానికి ఎంపిక చేసిన అంశంపై స్పందిస్తూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కూడా ఇదే కోణంలో కామెంట్స్ చేశారు. ఈనేపథ్యంలో తాను అఖిలపక్ష బృందంతో విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని యూసుఫ్ పఠాన్ ప్రకటించారు. కాగా, టీఎంసీ నుంచి ఎవ్వరు కూడా అఖిలపక్ష బృందాలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
విపక్ష నేతల టీమ్‌ను మసూద్ అజార్ ఇంటికి పంపాలి : సునీల్ జఖార్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు
భారత సైన్యంపై నోరు పారేసుకుంటున్న విపక్ష నేతలతో ప్రత్యేక టీమ్‌ను పాకిస్థాన్‌లోని ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ ఇంటికి పంపాలని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జఖార్ ప్రధాని మోదీని కోరారు. పాక్ భాషలో మాట్లాడుతున్న విపక్ష నేతలు, మసూద్ అజార్‌ను కలిసి సంతాపాన్ని, బాధను వ్యక్తం చేయొచ్చన్నారు. తన వ్యాఖ్యలు కేవలం రాహుల్ గాంధీని ఉద్దేశించినవి కావని, భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎంతోమంది విపక్ష నేతల వల్ల తాను ఇలా మాట్లాడాల్సి వస్తోందని సునీల్ జఖార్ పేర్కొన్నారు.
'మీ వ్యాఖ్యలతో దేశం సిగ్గుపడుతోంది'- మధ్యప్రదేశ్ మంత్రిపై సుప్రీం కోర్టు ఆగ్రహం
గోల్డెన్ టెంపుల్‌పై అటాక్‌కు పాక్ ప్లాన్- గీత కూడా పడనివ్వని ఇండియన్ ఆర్మీ