A Government Employee Suspension: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందిన నేపథ్యంలో దేశమంతా దిగ్భ్రాంతికి లోనై ఉంది. ఇలాంటి సమయంలో కేరళకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి- విమాన ప్రమాదంలో మరణించిన ఓ నర్సు గురించి ఫేస్బుక్లో అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ పెట్టాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ప్రభుత్వ ఉద్యోగిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
కాసర్గోడ్ జిల్లాలోని వెల్లరికుండు తాలూకా కార్యాలయంలో జూనియర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఏ.పవిత్రన్ అనే ఉద్యోగి - కేరళకే చెందిన రంజిత అనే నర్సుపై ఫేస్బుక్లో అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అది కూడా ఆమె ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన తరువాత. దీనితో పవిత్రన్‌ను జిల్లా కలెక్టర్ ఇన్బసేకర్ కె శుక్రవారం సస్పెండ్ చేశారు.

అవమానకరం!
పవిత్రన్ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్‌పై కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్ కూడా స్పందించారు. పవిత్రన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోస్ట్ తన దృష్టికి వచ్చిన వెంటనే అతనికి సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయడం జరిగిందని ఆయన అన్నారు.
మరోవైపు ఇలాంటి నీచమైన, అసభ్యకరమైన పోస్ట్ పెట్టిన పవిత్రన్‌పై కేసు నమోదు చేయనున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు.
దురదృష్టం!
ఇద్దరు పిల్లల తల్లి అయిన రంజిత యునైటెడ్ కింగ్డమ్లో నర్సుగా పనిచేస్తోంది. ఆమె తన ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి కేరళ వచ్చింది. విదేశాల్లో పని చేసిన తరువాత తిరిగి ఇండియాలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలని ఆమె భావించింది. ఇండియాకు వచ్చిన నాలుగు రోజుల తరువాత ఆమె తిరిగి లండన్‌కు పయనమైంది. కానీ దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో ఆమె తన ప్రాణాలు కోల్పోయింది.
దీనితో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, పతనంతిట్ట జిల్లా, పుల్లాడ్లోని రంజిత నివాసానికి వెళ్లారు. మృతురాలి ఇద్దరు పిల్లలను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అహ్మదాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిపోయింది. దీనితో విమానంలోని ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ మరణించారు. అంతేకాదు మెడికల్ కాలేజ్‌లోని కొందరు వైద్య విద్యార్థులు సహా ఇతరులు మృతి చెందారు. ఈ విమానంలోనే ఉన్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు.
'మృత్యు' విమానానికి 265 మంది బలి- అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ
విమాన ప్రమాదస్థలిని పరిశీలించిన మోదీ- సహాయకేంద్రాలు ఏర్పాటు చేసిన ఎయిరిండియా