Tree Man Of Odisha : ఆయనో దినసరి కూలీ. పూరి గుడిసెలో జీవనం. అయినా సరే పర్యావరణ పరిరక్షణకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు లక్షకు పైగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా ఉసాహి గ్రామానికి చెందిన గుంథిరామ్ జెనా. ఆయన దినసరి కూలీయే అయినా గొప్ప లక్ష్యంతో శ్రమిస్తున్నారు. దాన్ని సాకారం చేసేందుకు గుంథిరామ్ గత 40 సంవత్సరాలుగా మొక్కలు నాటుతున్నారు. ఆయన చొరవ వల్ల జిల్లాలోని ఎన్నో ఎకరాల భూమి పచ్చదనాన్ని సంతరించుకుంది. ఒడిశా ట్రీ మ్యాన్‌గా పేరొందిన గుంథిరామ్ జెనా, ఇప్పుడు 60 ఏళ్ల వయసులోనూ మొక్కలు నాటడాన్ని ఆపలేదు. దినసరి కూలీగా పనిచేస్తూ, పూరి గుడిసెలో జీవిస్తూ తన భార్య, ముగ్గురు కుమార్తెలను ఆయన పోషిస్తున్నారు. జీవనోపాధి కోసం కూలి పనులు చేశాక, మిగిలే సమయంలో గుంథిరామ్ మొక్కలు నాటుతున్నారు.
40 ఏళ్లుగా ఒకే దినచర్య
గుంథిరామ్ దినచర్య విషయానికొస్తే ఆయన రోజూ తెల్లవారుజామునే నిద్రలేచి ఎరువులు, విత్తనాలు, పార తీసుకుని ప్రభుత్వ భూముల వద్దకు బయలుదేరుతారు. అక్కడి భూముల్లో వివిధ రకాల మొక్కల విత్తనాలను చల్లుతారు. గతంలో తాను నాటిన మొక్కలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తారు. మండే ఎండల నుంచి మొక్కలను కాపాడేందుకు అవసరమైన నీటిని తన ఇంటి నుంచి గుంథిరామ్ మోసుకెళ్తుంటారు. గత 40 ఏళ్లుగా ఆయన దినచర్య ఇదే విధంగా ప్రారంభమవుతోంది. మొక్కలు నాటాక ఇంటికి తిరిగొచ్చి, సద్ది కట్టుకొని కూలీ పనులకు గుంథిరామ్ బయలుదేరుతారు. కూలీ పనులు ముగిశాక సాయంత్రంకల్లా ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఏ ప్రాంతంలో మొక్కలు నాటాలనే దానిపై సాయంత్రమే ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.

పుట్టుకొచ్చిన కొత్త అడవుల
మొక్కలు నాటే ఈ మహా యజ్ఞాన్ని 20 ఏళ్ల వయసులో గుంథిరామ్ ప్రారంభించారు. తొలుత సిమిలియా, మార్కండ్‌పూర్, బసుదేవ్‌పూర్, బిచిర్‌పూర్ గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుంచి సహాయం అందకున్నా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు. గుంథిరామ్ స్వగ్రామం ఉసాహి అనేది బసుదేవ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. బసుదేవ్‌పూర్‌తో పాటు ఇరుగుపొరుగున ఉన్న మార్కండ్ పూర్, సిమిలియా, బిచిర్పూర్ గ్రామ పంచాయతీల్లో ఆయన మొక్కలు నాటి కొత్త అడవులను సృష్టించారు. చెరువుల వద్ద, రోడ్ల చుట్టూ, ఖాళీ భూములు, బంజరు భూముల్లో మర్రి, వేప, రావి మొక్కలను గుంథిరామ్ అవిశ్రాంతంగా నాటినందు వల్లే ఈ కొత్త అడవులు ఏర్పడ్డాయి. 1999లో సూపర్ సైక్లోన్‌తో ఒడిశాలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. అయితే జాజ్‌పూర్ జిల్లాలో గుంథిరామ్ క్రియేట్ చేసిన కొత్త అడవులు ఆ అపార నష్టాన్ని భర్తీ చేశాయి.

మొక్కలు నాటడాన్ని అందుకే ఆపడం లేదు: గుంథిరామ్
‘‘ప్రభుత్వం నాకు కనీసం ఇంటిని కూడా మంజూరు చేయలేదు. జీవితం ఎంత కష్టతరంగా ఉన్నా, నా అభిరుచి కాబట్టి నేను మొక్కలు నాటడాన్ని ఆపడం లేదు. చాలా కష్టపడి నా పెద్ద కుమార్తెకు పెళ్లి చేశాను. మిగతా ఇద్దరు కూతుళ్లను పెంచడం నాకు ఒక సవాలుగా ఉంది’’ అని ఆయన ఈటీవీ భారత్‌కు చెప్పారు.
మాకు ఒక పక్కా ఇల్లు కావాలి : గుంథిరామ్ భార్య తులసి
‘‘నా భర్త తన సంపాదన నుంచి చాలా మొత్తాన్ని మొక్కలు నాటడానికి ఖర్చు చేస్తున్నారు. నేటివరకు మాకు ఎటువంటి ప్రభుత్వ సహాయం అందలేదు. ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే మేం నివసిస్తున్నాం. మాకు ఒక పక్కా ఇల్లు కావాలి’’ అని గుంథిరామ్ భార్య తులసి కోరారు.