900 Year Old AdenSonia Digitata : అడెన్ సోనియా డిజిటాటా- ఇదొక ఆఫ్రికా జాతి చెట్టు. ఈ అరుదైన వృక్షం దాదాపు గత 900 ఏళ్లుగా జార్ఖండ్‌లోని పలామూ జిల్లా మేదినీనగర్‌లోని నయా మొహల్లాలో ఉంది. ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడ నీటి సమస్య ఉండదని అంటారు. ఇంగ్లీష్ టామరిండ్, వైట్ టామరిండ్ అనే పేర్లతో భారత్‌లో పిలువబడే అడెన్ సోనియా డిజిటాటా జాతి వృక్షాలు పలామూ జిల్లా పరిధిలో మూడు ఉన్నాయి. రాంచీ పరిధిలోనూ రెండు నుంచి మూడు చెట్లు ఉన్నాయి. ఈ చెట్లపై భారత్‌లో జరిగిన రీసెర్చ్ సమాచారం, వాటికి సంబంధించిన ఆసక్తికర వివరాలతో కథనమిది.
భూగర్భజలాలు పెరిగిపోతాయ్!
ఆఫ్రికా ఖండం మన దేశం నుంచి ఎక్కడో సుదూరాన ఉంది. అడెన్ సోనియా డిజిటాటా జాతి వృక్షాల మూలాలు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. అవి అక్కడి నుంచి మన దేశంలోని జార్ఖండ్ రాష్ట్రం దాకా ఎలా చేరాయి? అనేది పెద్ద మిస్టరీ. ఈ చెట్లపై రీసెర్చ్ జరిగినప్పటికీ ఇప్పటి వరకైతే ఈ వివరాలను తెలుసుకోలేకపోయారు. ఆఫ్రికా దేశాల్లో ఉండే నేల స్వభావం అనేది అడెన్ సోనియా డిజిటాటా చెట్లు పెరగడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే, ఇది పర్యావరణంతో పాటు భూగర్భ జలాలను పరిరక్షిస్తుంది. జార్ఖండ్‌లోని మేదినీనగర్‌లో ఈ చెట్టు ఉన్న దాదాపు 200 మీటర్ల వ్యాసార్థంలోని ఏరియాలో నీటి మట్టం చాలా బాగుంది. మేదినీనగర్‌లోని నయా మొహల్లాలో భూగర్భజలాలు 35 నుంచి 40 అడుగుల దాకా ఉన్నాయి. అడెన్ సోనియా డిజిటాటా చెట్టు నుంచి 500 మీటర్ల దూరంలో నీటి మట్టం 400 నుంచి 1000 మీటర్ల దాకా ఉంది.
'సెసా' అధ్యయనంలో ఏం గుర్తించారు ?
పలామూ జిల్లాలోని అడెన్ సోనియా డిజిటాటా జాతి చెట్లపై స్ట్రాటజిక్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ సోషల్ అసెస్‌మెంట్ (సెసా) అనే సంస్థ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా ఈ చెట్టు స్వభావం, దానివల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ వివరాలతో మేదినీనగర్‌లోని నయా మొహల్లాలో ఉన్న అడెన్ సోనియా డిజిటాటా జాతి చెట్టు వద్ద ఒక బోర్డును ఏర్పాటు చేసింది. అందులో ఈ చెట్టుకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఉంది. ఈ వృక్షం మేదినీనగర్ నయా మొహల్లాకు 200 మీటర్ల దూరంలో ఉంది. పలామూ జిల్లాలో అడెన్ సోనియా డిజిటాటా జాతికి చెందిన కొత్త మొక్కలను నాటేందుకు ప్రయత్నాలు జరిగినా, అవన్నీ ఫెయిల్ అయ్యాయని రీసెర్చ్‌లో గుర్తించారు. భారత్‌లో ఈ జాతికి చెందిన చెట్లు 500 దాకా ఉన్నాయని వెల్లడైంది.

క్షీర సాగర మథనంలో ఉద్భవించింది!
"ఈ చెట్టు గురించి స్థానికులకు అనేక నమ్మకాలు ఉన్నాయి. దేవతలు, రాక్షసులు కలిసి క్షీర సాగర మథనం చేసినప్పుడు ఈ చెట్టు ఉద్భవించిందని ప్రజలు చెబుతుంటారు. మొత్తం మీద ఈ చెట్టు వల్ల మేదినీనగర్‌లోని నయా మొహల్లాలో 35 నుంచి 40 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉంటాయి. ఈ చెట్టు పక్కన ఉన్న చేతి పంపు నుంచి నీళ్లు పట్టుకోవడానికి ఊరి ప్రజలంతా వస్తుంటారు"
- ప్రదీప్ అకేలా, నయా మొహల్లా వార్డ్ కమిషనర్
కొత్త మొక్కలు పెరగకపోవడానికి కారణాలివీ :
"బహుశా వలస పాలకులు ఈ మొక్కను భారత్‌లో నాటి ఉండొచ్చు. వాళ్లే దీన్ని భారత్‌కు తీసుకొచ్చి ఉండొచ్చు. ఇది ఆఫ్రికన్ జాతి చెట్టు. ఇది ఆఫ్రికాలోని అత్యంత వేడి వాతావరణాన్ని తట్టుకొని పెరుగుతుంది. దీని కొత్త మొక్కలను నాటడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతిసారీ ఆ ప్రయత్నం విఫలమైంది. అడెన్ సోనియా డిజిటాటా జాతి చెట్ల విత్తనాలను ఉడకబెట్టడం, కుళ్లబెట్టడం, ఇతరత్రా పద్ధతుల ద్వారా మొక్కను పెంచడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. వాతావరణం, చెట్ల మధ్య పెరిగిన గ్యాప్ అనేది అతి పెద్ద కారణం. గతంలో గబ్బిలాలు వంటి జీవులు మొక్కల విత్తనాల అంకురోత్పత్తిలో కీలకమైన పాత్ర పోషించేవి. ఇప్పుడు గబ్బిలాల సంఖ్య తగ్గిపోతోంది"
- ప్రొఫెసర్ డీఎస్ శ్రీవాస్తవ, వృక్షశాస్త్ర నిపుణుడు
ఈ చెట్ల వల్ల ఫ్లోరైడ్ సమస్య రాదు!
"అడెన్ సోనియా డిజిటాటా చెట్ల వల్ల పర్యావరణానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నీటి మట్టం చాలా బాగా పెరుగుతుంది. ఫ్లోరైడ్ సమస్య రాదు" అని పర్యావరణవేత్త కౌశల్ కిషోర్ జైస్వాల్ తెలిపారు.
చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ- జాతికి అంకితం
సీఎం యోగి బర్త్‌డే వేళ హిందూ మతంలోకి ముస్లిం యువతి- ఆలయంలో ప్రేమికుడితో పెళ్లి