90శాతం వైకల్యం- నడవడం, మాట్లాడడం రాకపోయినా చెస్‌లో అద్భుతాలు!
చదరంగంలో అద్భుతాలు సాధిస్తున్న దిల్లీ యువకుడు - అనేక జాతీయ, ఆంతర్జాతీయ టోర్నమెంట్లలో పోటీకి!

Published : April 27, 2025 at 3:59 PM IST
Disabled Man Playing Chess : అతడి వయసు 25 ఏళ్లు. దాదాపు 90శాతం వైకల్యం. నడవడం, మాట్లాడడం కూడా రాదు. ఒక చేయి సహాయంతో చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోగలడు. అయినా సరే ఇవేవీ తన ప్రతిభకు అడ్డం కాదని నిరూపించాడు. కుర్చీలోనే ఉంటూ చెస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మెదుడుకు పదును పెడుతూ చందరంగంలో అదరగొడుతున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు?
దేశ రాజధాని దిల్లీలోని శాలిమార్ గార్డెన్లో మనోజ్ గౌతమ్ అనే వ్యక్తి తల్లిదండ్రులతో పాటు భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి. అయితే, అబ్బాయి వైభవ్ 90శాతం వైకల్యంతో బాధపడుతున్నాడు. నడవడం, మాట్లాడడం కూడా రావు. ఒక చేయి కాస్త పనిచేస్తుండడం వల్ల చిన్న చిన్న పనులను చేసుకుంటాడు. వైభవ్ పనులకు కుటుంబ సభ్యులు సహకారం అందిస్తూ అండగా ఉంటున్నారు.

టైమ్‌పాస్‌కు చెస్
ఏడేళ్ల క్రితం తన తండ్రి మనోజ్ గౌతమ్‌తో కలిసి టైమ్‌పాస్‌కు చెస్ ఆడడం ప్రారంభించాడు వైభవ్. ఆ తర్వాత అతడికి ఇదే అలవాటుగా మారిపోయింది. ఎవరూ శిక్షణ ఇవ్వకపోయినా తరచూ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఆన్లైన్ వేదికలను ఉపయోగించి దాదాపు 7-8 గంటల పాటు చెస్ ఆడుతుండేవాడు. మొబైల్‌ను ఉపయోగించి ప్రపంచంలోని అనేక మంది ఆటగాళ్లతో పోటీ పడుతుంటాడు. ఇలా చెస్‌లో నైపుణ్యం సంపాదించాడు.

సాధారణ పిల్లలతో పోటీపడి మొదటి స్థానం
ఈ క్రమంలోనే ఒకసారి పాఠశాలలో చెస్ పోటీలు నిర్వహించగా, సాధారణ పిల్లలతో పోటీపడి మొదటి స్థానం సంపాదించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు వెళ్లడం ప్రారంభించాడు. సాధారణ ఆటగాళ్లతో పోటీ పడి మరీ అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఉదయ్పుర్లో జరిగిన పోటీలో పాల్గొని మొదటి స్థానంతో పాటు రూ.1.11లక్షల బహుమతిని సాధించాడు. ప్రస్తుతం జూన్‌లో ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో, జూలైలో గోవాలో జరగనున్న చెస్ పోటీలకు సిద్ధమవుతున్నాడు.



"ప్రతి పిల్లవాడికి ఏదో ఒక రంగంలో ప్రతిభ ఉంటుంది. వారు ఎంచుకున్న వాటికి మనం అండగా ఉండాలి. వారి శక్తి సామర్థ్యాలు గుర్తించి మద్దతు తెలపాలి. మీరు చేసే చిన్న సహాయమే వారిని ఉన్నత స్థాయిలో నిలిపేలా చేస్తుంది. అందుకు వైభవ్ జీవితమే ఊదాహారణ. అతడి శరీరంలో బలహీనత ఉంది కానీ ధైర్యంలో లేదు." అని వైభవ్ తల్లిదండ్రులు చెబుతున్నారు.

మహిళకు రోబోటిక్ సర్జరీ - ప్రపంచంలోనే అతిపెద్ద అడ్రినల్ కణితి తొలగింపు
పుట్టిన రోజునాడే మరణించిన బైకర్- అంత్యక్రియలకు హాజరైన బైక్! కుటుంబసభ్యులు ఎమోషనల్

