BSF on Terrorists Enter India : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. అయితే, ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ప్రయత్నిచినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెల్లడించింది. 40-50మంది ఉగ్రవాదులను మే 8న సరిహద్దులను దాటించేందుకు పాక్ దళాలు తీవ్రంగా ప్రయత్నించాయని తెలిపింది. ఇందుకోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు బీఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్‌ఎస్ మండ్ ఓ వార్త సంస్థకు తెలిపారు.
'మా జవాన్లు వాళ్లకు తీవ్ర స్థాయిలోనే నష్టం కలిగించారు. అయితే, పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నట్లు మాకు ముందే సమాచారం అందింది. మేం అప్రమత్తమై వారి కోసం కాచుకుని కూర్చొన్నాం. ఆ గ్రూపులో దాదాపు 45-50 మంది వరకు ఉన్నారు. వారు మా వైపునకు వచ్చారు. దీంతో అదును చూసి వారిపై తీవ్రస్థాయిలో దాడులు చేశాం. మేం ఊహించినట్లే తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మేం కాల్పులు జరపడం వల్ల వారు తమ పోస్టులను వదిలేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. బంకర్లు, ఆయుధాలను ధ్వంసం చేశాం. దాదాపు గంటన్నరలోనే వారికి మేం బుద్ధి చెప్పాం. మరోసారి వస్తే పదింతల శక్తితో వారిని తిప్పికొట్టేందుకు మా జవాన్లు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బీఎస్‌ఎఫ్‌కు స్పష్టమైన ఆదేశాలున్నాయి. మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడుతున్నారు. వారిని చూస్తే మాకు గర్వంగా ఉంది' అని డీఐజీ వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ వేళ జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్ తిప్పికొట్టింది. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జరిగినట్లు బీఎస్ఎఫ్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.
జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత
మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వర్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. సింగ్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు తారసపడి కాల్పులు జరపగా భద్రతా బలగాలు సమర్ధంగా తిప్పికొట్టినట్టు తెలుస్తోంది. కాల్పులు కొనసాగుతున్నాయనీ, సుమారు నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
పాక్‌కు చుక్కలు చూపించిన ఇండియన్ ఆర్మీ! 3 నిమిషాల్లోనే 13 శత్రు స్థావరాలు ధ్వంసం!
పీవోకేలోని పాక్ సైనిక స్థావరాలు ధ్వంసం- దాయాదికి ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం