Process of Eye Donation : 'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అని మన పెద్దలు అంటుంటారు. ఇంతటి ముఖ్యమైన కంటి చూపుకు నోచుకోకుండా చీకట్లోనే గడుపుతున్న వారెందరో ఉన్నారు. అలాంటి వారికి మరణానంతరం కళ్లను దానం చేస్తే వారికి చూపును ఇచ్చినవారవుతారు. వారి జీవితాల్లోనూ వెలుగులు నింపినవారవుతారు. ఈ క్రమంలో జూన్ 10న ప్రపంచ నేత్రదాన దినోత్సవం సందర్భంగా నేత్రదాన ప్రక్రియపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
ఏడాదిలో 2543 మంది నేత్రదానం
మహారాష్ట్రలో ఒక ఏడాది వ్యవధిలో 2,543 మంది మొత్తం 5,086 నేత్రాలను దానం చేశారు. వీటిలో 3,097 నేత్రాల మార్పిడి జరిగింది. మరణించిన వ్యక్తి కళ్లను తొలగించడం, వాటిని మార్పిడి చేయడం, నేత్ర మార్పిడి ప్రాసెస్ గురించి అమరావతిలోని దిశా ఇంటర్నేషనల్ ఐ బ్యాంకు వ్యవస్థాపక కార్యదర్శి స్వప్నిల్ గవాండే ఈటీవీ భారత్‌కు క్షుణ్ణంగా వివరించారు. ఆయన మాటల్లోనే కళ్లను డొనేట్ చేసే ప్రక్రియను తెలుసుకుందాం.
నేత్రదాన ప్రక్రియ
- మీరు ఒక వ్యక్తి మరణానంతరం మరొకరికి చూపు ఇవ్వడానికి అతడి కళ్లను దానం చేయాలనుకుంటే మొదట తెరిచి ఉన్న మృతుడి నేత్రాలను మూసివేయాలి.
- మృతుడి తల కింద రెండు తలగడలను పెట్టాలి. తడి కాటన్ బాల్స్‌ను ఆ కళ్లపై ఉంటాలి. ఏదైనా కాటన్ వస్త్రంలో కళ్లను తేమగా చేయాలి. ఆ సమయంలో ఫ్యాన్‌ను ఆపివేయాలి.
- మృతుడి కళ్లను డొనేట్ చేయాలనుకున్న విషయాన్ని వెంటనే ఐ బ్యాంక్‌కు తెలియజేయాలి. వారు వెంటనే వచ్చి సంబంధిత మృతదేహం నుంచి కేవలం 20- 25 నిమిషాల్లోనే కళ్లను తీసుకుంటారు. ముఖ్యంగా నేత్ర దానం చేసే ముందు మరణించిన వ్యక్తి బంధువులు అతడి మృతికి గల కారణాన్ని గల లేఖను వైద్యుడి నుంచి పొందాలి.
- మరణించిన వ్యక్తి కళ్లను తొలగించేటప్పుడు, ఐ బ్యాంక్ ఆ వ్యక్తి రక్త నమూనాలను కూడా తీసుకుంటుంది. ఆ కళ్లను ఐ బ్యాంకుకు తీసుకెళ్లి వాటిని పరీక్షిస్తారు. వాటిలో ఉన్న కణాల సంఖ్యను లెక్కిస్తారు.
కంట్లో 2500 కణాలు ఉంటే దాన్ని మార్పిడి కోసం ఉపయోగిస్తారు. అంధుడికి చూపును ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. 1500- 2500 కణాలు ఉన్న నేత్రాన్ని ఇతరులకు అమరిస్తే అంధత్వంతో ఉన్న వ్యక్తికి అమరిస్తే అతడు స్పష్టంగా చూడగలడు. ఒక వ్యక్తి కన్ను విఫలమై అతని ముఖం వికృతంగా కనిపిస్తే, 1500 కణాల కంటే తక్కువ ఉన్న నేత్రాన్ని అతడికి అమరుస్తారు. అతడి ముఖం అందంగా తయారైనా, ఆ కన్ను దృష్టిని అందించదు.
'మహారాష్ట్రలో నేత్రదాన ఉద్యమం'
"మహారాష్ట్రలో నేత్రదాన ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఏటా రాష్ట్రంలో ఎనిమిదిన్నర లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో ఏడాది వ్యవధిలో 2,543 మంది మాత్రమే తమ కళ్లను దానం చేశారు. ఐరిస్ వల్ల కలిగే అంధత్వం నుంచి దేశాన్ని దూరంగా ఉంచాలనుకుంటే, కనీసం 30- 40 వేల నేత్రదానాలు అవసరం. ప్రస్తుతం మహారాష్ట్రలో 78 ఐ బ్యాంకులు యాక్టివ్ గా ఉండగా, 146 కంటి మార్పిడి కేంద్రాలు ప్రభుత్వం వద్ద నమోదయ్యాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని జిల్లా జనరల్ ఆస్పత్రుల్లో ప్రత్యేక నేత్రదానం కోసం కౌన్సిలర్లను నియమించారు. ఒక వ్యక్తి మరణించిన వెంటనే, ఈ కౌన్సిలర్లు వారి కుటుంబాలకు నేత్రదానం గురించి మార్గనిర్దేశం చేయడం, కళ్లు దానం ప్రాముఖ్యతను వారికి వివరిస్తారు. చాలా మంది నేత్రదానం చేయాలనుకుంటారు. అయితే, ప్రియమైన వ్యక్తి మరణం కారణంగా బాధలో మునిగిపోతారు. అప్పుడువారికి నేత్రదానం గురించి ఏమీ గుర్తుండదు. అలాంటి సందర్భంలో, కుటుంబానికి సలహా ఇవ్వడం కోసం కౌన్సిలర్ అవసరం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులో మరణించేవారి నేత్రదానాల సంఖ్య చాలా తక్కువగా ఉంది" అని స్వప్నిల్ గవాండే విచారం వ్యక్తం చేశారు.
'నేత్రదానంలో ఏఐ వినియోగం'
నేత్రదానానికి సంబంధించి తమ సంస్థ 24 గంటలు పనిచేస్తుందని దిశా ఇంటర్నేషనల్ ఐ బ్యాంకు వ్యవస్థాపక కార్యదర్శి స్వప్నిల్ గవాండే తెలిపారు. అమరావతి డివిజన్ లోని ప్రతి జిల్లాలో తాము చురుగ్గా పనిచేస్తున్నామన్నారు. నేత్రదానంలో తాము కొంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. దీని కోసం ఏఐ టెక్నాలజీ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ఈ సాంకేతికతతో ఒక వ్యక్తి మరణం తర్వాత అతని నేత్రాలు తదుపరి వ్యక్తికి ఎంత దృష్టిని అందించగలవో తాము ముందుగానే తెలుసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో కళ్లు అవసరం ఉన్నవారికి ఒక క్రమ పద్ధతిలో నేత్రాలను అందిస్తున్నామని వివరించారు. ఏఐ సాంకేతికతతో నేత్రదాన ఉద్యమం విజయవంతమవుతుందని స్వప్నిల్ గవాండే ఆశాభావం వ్యక్తం చేశారు.