Chhattishgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిపై రూ.13లక్షల రివార్డ్ ఉంది.
కొండగావ్-నారాయణ్‌పుర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం కొండగావ్‌కు చెందిన రిజర్వ్ గార్డ్, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతులు మావోయిస్టుల కమాండర్, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్లు చెప్పారు. హల్దార్, రమే తలలపై రూ.8 లక్షలు,రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
ఈ ఎన్కౌంటర్లో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 140 మంది మావోయిస్ట్‌లు మరణించారు. వారిలో నారాయణపుర్, కొండగావ్లతో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లోనే 123మంది ఉన్నారు.