13 ఫ్లేవర్ల తేనెలు రెడీ- రంగులు, రుచులు, ఔషధ గుణాల్లో దేనికదే స్పెషల్!
వివిధ రంగుల్లో 13 ఫ్లేవర్ల తేనెలు తయారీ- ఎక్కడంటే

Published : October 4, 2025 at 12:32 PM IST
13 Flavors Honey : తేనె అంటే ఒకే రకమైన రుచి ఉంటుందని మనం భావిస్తుంటాం. కానీ దీనిలోనూ ఎన్నో రకాల రుచులను అందించే ఫ్లేవర్స్ ఉంటాయని మనలో చాలామందికి తెలియదు. ఆ రాష్ట్రంలో ఏకంగా 13 రకాల ఫ్లేవర్ల తేనెలు తయారవుతున్నాయి. తులసి నుంచి జామూన్ దాకా, వాము నుంచి వేప దాకా తీరొక్క తేనెల ఉత్పత్తికి నెలవుగా ఆ రాష్ట్రం మారింది. ఇవన్నీ పూర్తి సహజ సిద్ధమైనవి. ఇంతకీ వీటిని ఎలా సేకరిస్తున్నారు ? ఇందుకోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఏయే ఏర్పాట్లు చేసింది ? ఈ విభిన్న ఫ్లేవర్ల తేనెల్లో ఉండే విశిష్ట ఔషధ గుణాలు ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.
తేనెటీగలు - పరాగసంపర్కం
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తేనెటీగల గురించి ఒక గొప్ప మాట చెప్పారు. అవి లేకపోతే భూమిపై జీవుల మనుగడ నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. ఐన్‌స్టీన్ ఇలా అనడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అదే పరాగసంపర్క ప్రక్రియ. తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని, పుప్పొడి రేణువులను నోటిలోకి పీల్చుకొని, వాటిని తీసుకెళ్లి తేనెతుట్టెలో జమ చేస్తాయి. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. తేనెటీగలు వారాల తరబడి అలసిపోకుండా చేసే శ్రమకు ఫలితంగానే తేనెతుట్టెల్లో తేనె జమ అవుతుంది. పూల మకరందం, పుప్పొడి రేణువులే తేనెగా మారుతాయి. ఒక పువ్వులోని పుప్పొడి రేణువులు (మగ భాగం), అదే రకమైన పువ్వులోని కీలాగ్రం (ఆడ భాగం)పైకి చేరడాన్ని పరాగసంపర్కం అంటారు. ఈ ప్రక్రియ తర్వాతే ఫలదీకరణం జరిగి మొక్కల్లో పండ్లు, విత్తనాలు ఏర్పడతాయి. గాలి, నీరు, కీటకాలు (తేనెటీగలు, సీతాకోకచిలుకలు), పక్షులు, గబ్బిలాలు వంటివి పరాగసంపర్కానికి సహాయపడతాయి.

తీరొక్క ఫ్లేవర్ల తేనె సేకరణ ఇలా
తేనెటీగలు సాధారణంగా రెండు నుంచి మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలోనే సంచరిస్తుంటాయి. ఆ ఏరియాలో ఉండే చెట్లు, మొక్కల పువ్వుల నుంచి మకరందాన్ని, పుప్పొడిని సేకరించి తమతమ తేనెతుట్టెల్లో జమ చేస్తాయి. ఈ అంశం ప్రాతిపదికన మధ్యప్రదేశ్ జీవవైవిధ్య బోర్డు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహాయంతో తేనె సేకరణ ప్రాజెక్టును అమలు చేస్తోంది. తులసి మొక్కలు, వేప చెట్లు, జామూన్ చెట్లు, వాము మొక్కలు, లిచీ చెట్లు, నీలగరి(యూకలిప్టస్) చెట్లు, రేగు చెట్లు, ఆవాల మొక్కలు, పూల మొక్కలు రాష్ట్రంలో పలుచోట్ల ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల తేనెటీగలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకే ఇటువంటి ప్రాంతాలను తమ ప్రాజెక్టు కోసం మధ్యప్రదేశ్ జీవవైవిధ్య బోర్డు ఎంపిక చేసింది. ఆయా చోట్ల తేనెటీగలను ప్రత్యేకమైన బాక్స్‌లలో ఉంచి పెంచుతున్నారు. అవి ఆ ఏరియాలో ఉన్న చెట్లు, మొక్కల మకరందాన్ని, పుప్పొడిని సేకరించి తెచ్చి బాక్స్‌లో జమ చేస్తున్నాయి. ఈవిధంగా తేనెటీగలు 15 రోజుల వ్యవధిలో ఒక్కో బాక్స్‌లో 3 కిలోల తేనెను జమ చేస్తుండటం విశేషం. ఇదంతా స్వచ్ఛమైన, సహజసిద్ధమైన తేనె.

ఫ్లేవర్లతో పాటు రంగులూ విభిన్నం
తులసి పూల నుంచి తేనెటీగలు సేకరించిన మకరందంతో తులసి తేనె ఏర్పడుతుంది. జామూన్ చెట్ల నుంచి సేకరించిన మకరందం, పుప్పొడితో జామూన్ తేనె తయారవుతుంది. విభిన్న రకాల పూల మొక్కల మకరందంతో ఏర్పడే దాన్ని మల్టీ ఫ్లోరా తేనె అంటారు. ఇదే విధంగా లిచీ తేనె, వేప తేనె, యూకలిప్టస్ తేనె, రేగుపండ్ల తేనె, వాము తేనె, ఆవాల తేనె సహా దాదాపు 13 రకాల ఫ్లేవర్ల తేనెలను సేకరిస్తున్నారు. ఇందులో వేరే ఫ్లేవర్లను కలపరు. అయితే తేనెటీగలు సేకరించిన మకరందం, పుప్పొడి లక్షణాలను బట్టి ఈ విభిన్న తేనెల రంగులు చాలా భిన్నంగా ఉంటుంది. అటవీ తేనె, తులసి తేనె, యూకలిప్టస్ తేనె, జామూన్ తేనె ముదురు రంగులో ఉంటాయి. ఆవాల తేనె, హిమాలయన్ తేనె అంతగా ముదురు రంగులో ఉండవు.

ఫ్లేవర్ల తేనెలు - ఆరోగ్య ప్రయోజనాలు
ఈ విభిన్న ఫ్లేవర్ల తేనెలు భిన్నమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు తులసి తేనెను జలుబు, దగ్గు చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జామున్ తేనె మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వేప తేనె, వాము తేనెలోనూ విశిష్టమైన ఔషధ గుణాలు ఉంటాయి. తేనెతుట్టెల నుంచి ఉత్పత్తి అయ్యే మైనం, పుప్పొడిని సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు.

'ఈ ప్రాజెక్టు వల్ల పంట దిగుబడి కూడా పెరిగింది'
'తేనెటీగల పెంపకం అంటే తేనెను ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు. మా దృష్టి పరాగసంపర్కంపైనా ఉంది. ఈ ప్రక్రియ వల్ల పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. మేం చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల పరిసర ప్రాంతాల్లో పంటల దిగుబడి బాగా పెరిగినట్లు గుర్తించాం. ఇదంతా తేనెటీగలు చేసిన పరాగసంపర్క ప్రక్రియ ఎఫెక్ట్. ప్రస్తుతం 13 రకాల ఫ్లేవర్ల తేనెను మేం మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తున్నాం. దానిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. గాలి చొరబడని గాజు సీసాలో తేనెను ఉంచితే, ఏళ్ల తరబడి అది చెడిపోదు' అని మధ్యప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు నిపుణుడు ఆనంద్ పాటిల్ తెలిపారు.


