ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బతుకుదెరువు కోసం కువైట్​ వెళ్లి మహిళ నరకయాతన - స్పందించిన సీఎం చంద్రబాబు

కువైట్​లో పని కోసం వెళ్తే మాయమాటలు చెప్పి శాశ్వతంగా అమ్మేశారన్న మహిళ - తన బాధలను వీడియో ద్వారా విడుదల - స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం

Woman Request To CM Chandrababu
Woman Request To CM Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2026 at 7:30 PM IST

Updated : May 20, 2026 at 8:56 PM IST

Woman Request To CM Chandrababu:బతుకుదెరువు కోసం వివిధ దేశాలకు వెళ్లిన రాష్ట్ర ప్రజలను ఏజెంట్లు, అక్కడి యజమానులు వేధించిన ఘటనలు చాలానే వెలుగు చూశాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ-ఎన్నారై విభాగం నేతల సమన్వయంతో పదుల సంఖ్యలో స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది.

అయితే తాజాగా బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నానంటూ చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన భాగ్యవతి సెల్ఫీ వీడియో విడుదల చేయడం బాధాకరం. పీలేరుకు చెందిన ఏజెంట్ చిన్నబ్బ మాయమాటలు నమ్మి మోసపోయానని సెల్ఫీ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పీలేరుకు చెందిన ఏజెంట్ చిన్నబ్బ ఇంటి పనుల చేయడానికి కువైట్ పంపుతానని చెప్పి శాశ్వతంగా అమ్మేశారని వాపోయారు.

కువైట్​లో చిక్కుకున్న మరో ఏపీ మహిళ - రక్షించాలంటూ సీఎం ను కోరుతూ వీడియో విడుదల (ETV Bharat)

రక్షించాలంటూ వీడియో విడుదల: కువైట్‌లో శారీరకంగా, మానసికంగా తనను వేధిస్తున్నారంటూ భాగ్యవతి కన్నీటి పర్యంతమయ్యారు. తనను రక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్​లను వీడియో ద్వారా వేడుకున్నారు. ఇండియాకు వచ్చేస్తానంటే ఏజెంట్‌కు ఇచ్చిన డబ్బులు కట్టాలంటూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని వీడియోలో తెలిపారు. ఇదే విషయాన్ని తొండవాడలో ఉంటున్న తన తల్లి తులసమ్మకు తెలపడంతో మూడు రోజుల క్రితం చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ఎలాగైనా రక్షించాలని ఈ సందర్భంగా కోరారు.

"చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన అమ్మాయిని నేను. మా పేరు భాగ్యవతి. బతుకు తెరువు కోసం, మా పిల్లల చదువులు, అప్పులపాలు కావడం మొదలైన ఆర్ధిక కారణాలతో చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఏజెంట్ చిన్నబ్బ అనే ఏజెంట్​ ద్వారా నేను కువైట్​కు వెళ్లాను. ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంటి పనుల చేయడానికి కువైట్ పంపుతానని చెప్పి శాశ్వతంగా అమ్మేశారని చాలా ఆలస్యంగా తెలిసింది. ఇండియాకు వచ్చేస్తానంటే ఏజెంట్‌కు ఇచ్చిన డబ్బులు కట్టాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. మా ఫోన్​లు లాగేసుకుని, నిన్ను ఇండియాకు పంపేది లేదు. నిన్ను ఏజెంట్​ అమ్మేశారు. వెళ్లాలంటే మేము ఏజెంట్‌కు ఇచ్చిన డబ్బులు కట్టాలని మనోవేదనకు గురి చేస్తున్నారు. నన్ను ఈ కష్టం నుంచి కాపాడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, చంద్రగిరి స్థానిక నాయకులందరినీ ఈ సందర్భంగా వేడుకుంటున్నాను"-భాగ్యవతి, బాధితురాలు

కువైట్ వెళ్లి మోసపోయిన బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు మంత్రి లోకేశ్​. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెడితే చాలు మెరుపువేగంతో స్పందిస్తూ గొడ్డు చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే ఎన్నారై టీడీపీ బృందాలనూ రంగంలోకి దింపి బాధితులను ఎడారి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు.

తాజాగా బతుకుదెరువు కోసం మస్కట్​కు వెళ్లిన అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన షాన్వాజ్ అక్కడి సేఠ్‌ తనను నిత్యం వేధిస్తూ కొడుతున్నాడని, చంపేస్తారని భయమేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నే తనను కాపాడాలంటూ తన బాధలను చెప్పుకొంటూ ఒక వీడియో చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టగా దీనికి వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ అధికారులు, షాన్వాజ్‌ను తిరిగి స్వదేశానికి తీసుకురావడం విశేషం.

తక్షణమే స్పందించిన సీఎం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఈటీవీ కథనాలపై సీఎం కార్యాలయం తక్షణం స్పందించింది. బాధిత మహిళను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కువైట్‌కు వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తుండగా, ఉద్యోగ వీసా కల్పించకుండా ఏజెంట్లు నిర్లక్ష్యం చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు, సోషల్ మీడియా ద్వారా బాధితురాలు సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. స్వదేశానికి తిరిగి పంపించాలని కోరితే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

స్వదేశానికి తీసుకురావాలని ఆదేశం:రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఏపీ ఎన్‌ఆర్టీ వెంటనే స్పందించి, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నిస్తోంది. అదే విధంగా సంబంధిత ఏజెంట్ల పాత్రపై విచారణ చేపట్టాలని, అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీస్ స్టేషన్ అధికారులు కూడా భాగ్యవతి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భరోసా ఇచ్చారు.

'పవనన్నా నన్ను కాపాడు-చంపేస్తారని భయమేస్తోంది' - కువైట్​ నుంచి మహిళ వీడియో

కువైట్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ - రక్షించాలంటూ ఆడియో విడుదల

Last Updated : May 20, 2026 at 8:56 PM IST