బెంగళూరు-విజయవాడ హైవే నిర్మాణం - నాలుగు గిన్నీస్ రికార్డులు
బెంగళూరు-విజయవాడ హైవే నిర్మాణంలో 4 గిన్నిస్ రికార్డులు - ఘనత సాధించిన ఎన్‌హెచ్‌ఏఐ, గుత్తేదారు సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ - రికార్డు నెలకొల్పడాన్ని ప్రశంసించిన గడ్కరీ, చంద్రబాబు - వర్చువల్‌గా ధ్రువీకరణపత్రాలు అందజేత
By ETV Bharat Andhra Pradesh Team
Published : January 12, 2026 at 12:57 PM IST
|Updated : January 12, 2026 at 6:59 PM IST
Guinness World Record in Road Construction :రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు - కడప - విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకుంది. నేషనల్ హైవే అథార్టీ, కాంట్రాక్ట్ సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే స్ట్రెచ్‌పై ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పాయి. ఈ అసాధారణ ఇంజినీరింగ్ ప్రతిభను ప్రశంసిస్తూ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం చంద్రబాబు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు, రాష్ట్ర యంత్రాంగానికి, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నిస్ రికార్డులు :గ్రీన్‌ఫీల్డు హైవేలో నిర్విరామంగా రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేసి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ, గుత్తేదారు సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ కొత్త రికార్డు నమోదు చేశాయి. బెంగళూరు-విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. ఈ నెల 5న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నెల 6 బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లోపు పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది.
ప్రతిష్టాత్మక సంస్థల పర్యవేక్షణ : 24 గంటల్లో అత్యధికంగా 10వేల 655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరంగా వేసి మూడో రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డు నెలకొల్పడం కోసం 70 టిప్పర్లు, 5 హాట్ మిక్స్ ప్లాంట్లు, 17 రోలర్లు, అత్యాధునిక సెన్సార్ పేవర్లను వినియోగించింది. మొత్తం 156 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి నాలుగో రికార్డును సృష్టించింది. నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. ఈ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే బెంగళూరు - విజయవాడ మధ్య ప్రయాణ దూరం 100 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 4 గంటల మేర తగ్గనుంది.
రికార్డు స్ఫూర్తితో కారిడార్ మిగిలిన పనులూ పూర్తి :ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్ గడ్కరీ, చంద్రబాబు వేర్వేరుగా ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత్వంలో సాధించిన ఈ విజయాలు ప్రపంచస్థాయి హైవే మౌలిక వసతుల కల్పన, భారీ ప్రాజెక్టుల అమలులో మన సత్తాను చాటిచెప్పాయని గడ్కరీ పేర్కొన్నారు. ఇప్పటికే సాధించిన రికార్డు స్ఫూర్తితో కారిడార్ మిగిలిన పనులూ పూర్తి చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గిన్నిస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు.
"శ్రీసత్యసాయి పవిత్ర జన్మభూమిలో గిన్నిస్ రికార్డుల పట్ల ఆనందంగా ఉంది. ఈ విజయం సాధించడంలో కృషిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు. నూతన సాంకేతికతతో నాణ్యమైన రహదారుల నిర్మాణం గొప్ప విషయం. తక్కువ సమయంలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తిచేశారు. నాణ్యత విషయంలో రాజీలేకుండా రహదారుల నిర్మాణం జరుగుతోంది. పెరుగుతున్న సాంకేతికతతో రహదారుల అనుసంధానం వేగవంతమైంది. మన ఇంజినీర్లు, అధికారులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. రహదారుల నిర్మాణాల్లో మరిన్ని నూతన అద్భుతాలు రాబోతున్నాయి. నూతన గుత్తేదారులకు కూడా ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుంది". -గడ్కరీ, కేంద్రమంత్రి
"గిన్నిస్ రికార్డు సాధించిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను మొదటిసారి సీఎంగా పనిచేసినప్పుడు బాంబే-పుణె సిమెంట్ రోడ్డు నిర్మాణం చూశాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేశా. రెండు కోట్ల జనాభా ఉన్న మలేషియాలో ఈస్ట్-వెస్ట్ కారిడార్‌కు 8 లైన్ల రహదారి చూశా. వాజ్‌పేయీ హయాంలో రహదారుల నిర్మాణానికి మహర్దశ వచ్చింది. నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించడమంటే గొప్ప విషయం. రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్, ఐఐటీ బాంబే విద్యా సంస్థకు అభినందనలు." -చంద్రబాబు, సీఎం
జాతీయ రహదారి నిర్మాణంలో ఏపీ చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నాయకత్వంలో జాతీయ రహదారుల అభివృద్ధికి లభిస్తున్న ప్రాధాన్యత, ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ అంకితభావానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని గతంలోనే సీఎం చంద్రబాబు చెప్పారు. అత్యున్నత ఎన్‌హెచ్‌ఏఐ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఈ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. జనవరి 11, 2026 నాటికి ఈ కారిడార్‌లోని ప్యాకేజీలు 2&3పై మరిన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. “ఇండియా నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
గత రికార్డులను అధిగమించేలా హైవే నిర్మాణం - గిన్నిస్ రికార్డే లక్ష్యం!