ETV Bharat / state

తెలంగాణ వర్సిటీని వేధిస్తోన్న సమస్యలు.. త్వరలోనే 'బాసర' సీన్ రిపీట్..!

author img

By

Published : Jun 24, 2022, 6:46 AM IST

T.U. PROBLEMS: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ.. బాసర ట్రిపుల్ ఐటీని ప్రతిబింబిస్తున్నాయి. అన్ని వర్సిటీల్లో దశాబ్దాలుగా సమస్యలు తిష్ఠ వేశాయి. వసతుల లేమి, అధ్యాపకుల కొరత వంటి సమస్యలు నిజామాబాద్ తెలంగాణ వర్సిటీని వేధిస్తున్నాయి. విశ్వవిద్యాలయం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అథోగతే తప్ప.. పురోగతి లేకుండా పోయింది. వీసీలు, రిజిస్ట్రార్‌లు మారినా వర్సిటీ రాత మాత్రం మారడం లేదు. బాసర విద్యార్థుల పోరాట స్ఫూర్తితో సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఆందోళనలకు సిద్ధమవుతున్నారు విద్యార్థులు. వర్సిటీ పాలకులు సత్వరం స్పందించకుంటే బాసరను తలపించే అవకాశం ఉంది.

తెలంగాణ వర్సిటీని వేధిస్తోన్న సమస్యలు.. త్వరలోనే 'బాసర' సీన్ రిపీట్..!
తెలంగాణ వర్సిటీని వేధిస్తోన్న సమస్యలు.. త్వరలోనే 'బాసర' సీన్ రిపీట్..!

తెలంగాణ వర్సిటీని వేధిస్తోన్న సమస్యలు.. త్వరలోనే 'బాసర' సీన్ రిపీట్..!

T.U. PROBLEMS: తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి దశాబ్దం గడుస్తున్నా.. ఇంకా సమస్యల సుడిగండంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. నిత్యం ఏదో వివాదంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. పదేళ్లు దాటినా.. ఇంజినీరింగ్ కోర్సు లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. అరకొర సౌకర్యాలతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. సరిపడా వసతి గదులు లేక అమ్మాయిల అవస్థలు వర్ణణాతీతం. వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం సహా మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధ్యాపకులు, సిబ్బంది కొరత వేధిస్తూనే ఉందని విద్యార్థులు వాపోతున్నారు.

రోజువారీ అవసరాలకూ డిచ్‌పల్లికి..: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న వర్సిటీకి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. విశ్వవిద్యాలయం ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్నా.. బస్సు మాత్రం రావడం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది. బస్ షెల్టర్ పూర్తయినా.. అందుబాటులోకి బస్ రాలేదు. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. అత్యవసర చికిత్స అందించేందుకు ఆసుపత్రి లేదు. 20 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాదే దిక్కు. హెల్త్ సెంటర్ ఇటీవలే ప్రారంభించినా.. వైద్యుడు 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. క్యాంటీన్ పూర్తయినా.. పూర్తిగా అందుబాటులోకి రాలేదు. రోజువారీ అవసరాలకూ డిచ్‌పల్లికి వెళ్లాల్సిన దుస్థితి.

పోరాటం తప్పదు..: వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయిలో అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. పూర్తిస్థాయి ప్రొఫెసర్లు లేక అకాడమిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. సగం మందికి పైగా హైదరాబాద్‌ నుంచి వచ్చిపోవడం వల్ల పాలన గాడి తప్పింది. నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఎక్కువ మంది పొరుగు సేవలు, ఒప్పంద పద్ధతిలోనే పని చేస్తున్నారు. బాలికల సంఖ్యకు తగ్గట్లు వసతి గృహం ఏమాత్రం సరిపోవడం లేదు. క్రీడా మైదానం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుంది. వాకింగ్‌ ట్రాక్‌, స్పోర్ట్స్ బోర్డు, జిమ్‌ లేక పోలీసు ఉద్యోగార్థులకు సమస్యగా మారింది. సవాళ్లుగా మారి సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు ఇటీవల వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఆందోళనకు సిద్ధం..: తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వర్సిటీ పాలకవర్గం దిద్దుబాటు చర్యలు చేపడితేనే.. చదువులు సజావుగా సాగే అవకాశం ఉంది.

ఇవీ చూడండి..

ఏడేళ్ల గోస.. ఏదీ ధ్యాస.. న్యాక్‌ ‘సి’ గ్రేడ్‌తో మరింత అప్రతిష్ఠ

నోబెల్ శాంతి బహుమతికి 103 మిలియన్​ డాలర్లు.. నగదు మొత్తం వారికే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.